Share News

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Apr 28 , 2026 | 05:57 AM

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అజారుద్దీన్‌తో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం ప్రమాణ స్వీకారం

  • హాజరైన సీఎం రేవంత్‌, మంత్రులు

  • మా కెప్టెన్‌ రేవంత్‌రెడ్డి: అజారుద్దీన్‌

  • ప్రజల గళాన్ని వినిపిస్తా: కోదండరాం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అజారుద్దీన్‌తో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా హాజరై నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌, ఎంపీ వేం నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద సమస్యకు పరిష్కారం లభించిందని, చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశానని, ప్రజల గళాన్ని వినిపించేందుకు ఈ పదవిని ఒక వేదికగా ఉపయోగించుకుంటానని తెలిపారు. తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యమకారుల సంక్షేమం, నిరుద్యోగ సమస్య, కార్మికుల హక్కులు, ఆదివాసీల హక్కుల కోసం పని చేస్తానని తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ తమ కెప్టెన్‌ రేవంత్‌రెడ్డి అని, తనపై నమ్మకం ఉంచిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు క్రికెట్‌ అభిమానులే ఎక్కువని, ఇకపై ప్రజల కోసం కష్టపడి పనిచేసి రాజకీయ అభిమానులనూ సంపాదించుకుంటానన్నారు. మైనారిటీల అభ్యున్నతికి సీఎం రేవంత్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాజకీయాల్లో క్లీన్‌ బోల్డ్‌ అనేదే ఉండదని, చూసి ఆడుకుంటూ ముందుకెళ్లాలని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 28 , 2026 | 05:59 AM