Share News

Auto Driver Threatens Traffic Police: ఆటో ఇస్తావా ? పాము వదిలెయ్యనా ?

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:52 AM

మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న కొందరు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించే పోలీసులకు తమ వింత ప్రవర్తనతో షాకులిస్తూనే ఉన్నారు.

Auto Driver Threatens Traffic Police: ఆటో ఇస్తావా ? పాము వదిలెయ్యనా ?

  • పామును చూపించి ట్రాఫిక్‌ పోలీసులను బెదిరించిన ఆటో డ్రైవర్‌

  • చచ్చిన పాముతో మద్యం మత్తులో వీరంగం

  • హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో ఘటన

  • నిందితుడి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

మదీన, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న కొందరు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించే పోలీసులకు తమ వింత ప్రవర్తనతో షాకులిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల ఓ యువకుడు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షకు సహకరించకుండా తలను గోడకేసి కొట్టుకున్న ఘటన మరువకముందే.. ఓ ఆటోడ్రైవర్‌ ఏకంగా పామును చూపించి బెదిరింపులకు దిగాడు. నా ఆటోని నాకు ఇస్తావా ? పామును వదిలేయమంటావా ? అంటూ ఓ పాము ట్రాఫిక్‌ పోలీసుకు చూపించి నానాహంగామాసృష్టించాడు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న చాంద్రాయణగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు.. అటుగా వచ్చిన ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను తనిఖీ చేశారు. పహాడిషరీఫ్‌ చార్మినార్‌ మసీదు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ ఇర్ఫాన్‌(32) పరిమితికి మించి మద్యం తాగినట్టు తేలడంతో అతడి ఆటోను సీజ్‌ చేశారు. దీంతో ఇర్ఫాన్‌ తన జేబులో నుంచి ఓ పొడవైన పామును బయటకు తీసి.. ఆటోను తిరిగిస్తావా లేదా పామును మీద పడేయమంటావా ? అంటూ ట్రాఫిక్‌ ఎస్సైని బెదిరించాడు. ఆ పామును చేతికి చుట్టుకొని కాసేపు వీరంగం సృష్టించాడు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులకు.. ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాణం లేని పాముతో ఇర్ఫాన్‌ పోలీసులను బెదిరించినట్టు గుర్తించారు. ఇర్ఫాన్‌పై విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని బెదిరించడంతోపాటు న్యూసెన్స్‌ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 05 , 2026 | 02:52 AM