రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యే
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:12 AM
రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(36) మరణంలో మిస్టరీ వీడింది. ఆర్థిక వివాదాల నేపథ్యంలో శ్రీనివాస్‌ను అతని స్నేహితుడే హత్య చేయించాడని తేలింది....
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితుడే బలి తీసుకున్నాడు.. రూ.5 లక్షల సుపారీ ఇచ్చి హత్య
పథకం ప్రకారం తీసుకెళ్లి.. కత్తులతో పొడిచి, రాడ్లతో కొట్టి ప్రాణం తీసిన వైనం
నలుగురు నిందితుల అరెస్ట్
కూసుమంచి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(36) మరణంలో మిస్టరీ వీడింది. ఆర్థిక వివాదాల నేపథ్యంలో శ్రీనివాస్‌ను అతని స్నేహితుడే హత్య చేయించాడని తేలింది. కేసు వివరాలను పోలీసులు ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో ఫిబ్రవరి 14న ఓ కారు బోల్తాపడింది. అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతదేహం కారు వెనుక సీట్లో ఉండడం, శరీరంపై గాయాలు, ప్రమాద సమయంలో ఓ వ్యక్తి పరారయ్యాడన్న సమాచారంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.
ఆర్థిక లావాదేవీల వల్లే హత్య
గొల్ల అలియాస్ బొగ్గుల శ్రీనివాస్ రచయితగా, యూట్యూబర్‌గా చాలా గుర్తింపు పొందాడు. శ్రీనివాస్‌తో పాటు మేకల వేణుమాధవ్‌రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదువుకున్నారు. వేణుమాధవ్‌రెడ్డి.. మేకా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ పెట్టి సబ్‌కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. కొంతకాలం క్రితం జరిగిన కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిద్దరూ కలుసుకున్నారు. తనకు బొగ్గుల బీబీక్యూ పేరిట జీఎస్టీ లైసెన్స్ ఉందని శ్రీనివాస్ తన స్నేహితుడు వేణుమాధవ్‌కు చెప్పాడు. బొగ్గుల బీబీక్యూ పేరు మీద నకిలీ ఇన్‌వాయి్‌సలు, సేల్స్ ఫైల్స్ చేసి లాభాలు పొందవచ్చని వేణుమాధవ్ ఈ సందర్భంగా శ్రీనివా్‌సకు చెప్పాడు. వచ్చిన లాభాల్లో తనకు 50 శాతం వాటా ఇస్తే ఈ పనికి తాను సిద్ధమని శ్రీనివాస్ షరతు పెట్టాడు. ఇరువురు అంగీకరించగా 2022-25వరకు జీఎస్టీ ఫైలింగ్‌తో రూ.90లక్షల వరకు సంపాదించారు. అందులో శ్రీనివాస్ వాటాగా రూ.45లక్షలు రావాల్సి ఉండగా.. వేణుమాధవ్‌రెడ్డి రూ.15లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందులున్నాయని, మిగిలిన మొత్తాన్ని కొన్ని రోజుల తర్వాత ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలో జీఎస్టీ అవకతవకలకు సంబంధించి వేణుమాధవ్, శ్రీనివా్‌సకు జీఎస్టీ శాఖ నుంచి నోటీసులు అందాయి. బొగ్గుల బీబీక్యూ లైసెన్స్‌ను జీఎస్టీ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు.
దీంతో శ్రీనివాస్ తనకు చెల్లించాల్సిన రూ.30లక్షలు ఇవ్వాలని, బ్లాక్‌లిస్టులో ఉన్న జీఎస్టీ లైసెన్స్‌ను యాక్టివేట్ చేయించాలని వేణుమాధవ్‌రెడ్డిని అడిగాడు. లైసెన్స్ పునరుద్ధరణకు ప్రయత్నించగా.. వారు చేసిన అవకతవకలకు గాను రూ.కోటి వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. శ్రీనివా్‌సకు రూ.30లక్షలు ఇవ్వాల్సి ఉండటం, లైసెన్స్ యాక్టివేట్ కోసం జరిమానా చెల్లించాలనడం, ఇతరత్రా ఆర్థిక భారాలతో సతమతమైన వేణుమాధవ్‌రెడ్డి.. శ్రీనివా్‌సను అడ్డుతొలగించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని భావించాడు. శ్రీనివా్‌సను హత్య చేయించేందుకు కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అజ్మత్ ఆలీఖాన్‌కు సుపారీగా రూ.5లక్షలు చెల్లించాడు.
డబ్బిస్తానని నమ్మించి తీసుకెళ్లి..
బకాయి డబ్బు ఇస్తానంటూ శ్రీనివా్‌సను నమ్మించిన వేణుమాధవ్‌రెడ్డి.. డబ్బు కోసం విజయవాడ వెళదామని చెప్పి ఈనెల 13న రాత్రి శ్రీనివాస్‌ను హైదరాబాద్ నుంచి కారులో తీసుకెళ్లాడు. అప్పటికే కారులో సుపారీ గ్యాంగ్ ఉంది. అయితే, 14న తెల్లవారుజామున కారును నకిరేకల్ నుంచి జనగామ వెళ్లే రహదారి వైపు మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీనివా్‌సపై కత్తులు, రాడ్లతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించాలని కారును నిందితుల్లో ఒకరైన అజ్మత్ అలీఖాన్‌కు ఇచ్చి ఖమ్మం వైపు పంపారు. కారు వెనుక సీట్లో శ్రీనివాస్ మృతదేహం ఉండగా.. అజ్మత్ కారును పాలేరు జలాశయంలో దూకించాడు. అనంతరం కారులో నుంచి దూకి పరారయ్యాడు. ఈ క్రమంలో అజ్మత్ కాళ్లకు గాయాలయ్యాయి. అయితే, మృతదేహం పరిస్థితి, ఘటనాస్థలం నుంచి ఓ వ్యక్తి పరారయ్యాడనే సమాచారంతో పోలీసులు.. సీసీ ఫుటేజీలు, ఫోన్‌కాల్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ప్రకారం శ్రీనివా్‌సది సుపారీ హత్యగా తేల్చారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.