Share News

ఎన్నారైల దత్తతకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

ABN , Publish Date - May 26 , 2026 | 04:43 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ఏర్పాటులో తమ వంతు సహకారం అందించేందుకు అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌...

ఎన్నారైల దత్తతకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆసక్తి తెలిపిన ఆటా ప్రతినిధులు

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ఏర్పాటులో తమ వంతు సహకారం అందించేందుకు అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ముందుకువచ్చింది. సోమవారం ఆటా ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను దత్తత తీసుకునేందుకు పలువురు ఎన్నారైలు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డితో సమన్వయం చేసుకుని స్కూళ్ల అభివృద్ధికి ఏం చేయాలనుకుంటున్నదానిపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి వారిని కోరారు. కాగా, జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని వారు ఆహ్వానించారు. తెలుగు మహాసభల్లో చేపట్టే కార్యక్రమాలను ఆటా అధ్యక్షుడు జయంత్‌ చల్లా వివరించారు. ఈసారి మహాసభలకు తాను హాజరవుతానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆటా ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో ఆటా అధ్యక్షుడు జయంత్‌ చల్లాతోపాటు నేషనల్‌ కో ఆర్డినేటర్‌ శరత్‌ వేముల, ఆటా తెలుగు మహాసభల కోఆర్డినేటర్లు తిరుమలరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, మంత్రి జూపల్లి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 04:43 AM