నిత్యావసర సరుకుల భరోసా..
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:36 AM
ఎల్‌నినో విపత్తుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పేద, మధ్యతరగతి ప్రజల వంటింట్లో ధరలు భగ్గుమని మండుతున్నాయి. సన్న రకం బియ్యం ధర కిలో రూ.80 నుంచి రూ.95 వరకు చేరింది. ఇతర
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఎల్‌నినో విపత్తుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పేద, మధ్యతరగతి ప్రజల వంటింట్లో ధరలు భగ్గుమని మండుతున్నాయి. సన్న రకం బియ్యం ధర కిలో రూ.80 నుంచి రూ.95 వరకు చేరింది. ఇతర నిత్యావసర సరుకుల ధరలు 5 నుంచి 25 వరకు పెరగడంతో పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. మరోవైపు సూపర్ ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గి నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ధరల మంట నుంచి, కరువు పరిస్థితుల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటగా నిత్యావసరాల సరుకుల భరోసా పథకం మరోసారి ప్రభుత్వం సంక్రాంతి నుంచి అందించడానికి పరిశీలిస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన నుంచి బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు కూడా అందజేస్తామని చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఎల్‌నినోతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసరాల భరోసా పథకంలో ఆరు రకాల సరుకులు అందించడానికి ప్రభుత్వం పరిశీలన జరపడం రేషన్ లబ్ధిదారులకు ఊరటగా మారుతుంది. దాదాపు 14 నెలల కు సరిపడే సరుకులు నిల్వ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
జిల్లాలో 5.79 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో రేషన్ లబ్ధిదారులకు 345 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న రేషన్ లబ్ధిదారులకు ప్రతినెలా ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్న బియ్యం ఈసారి కూడా అక్టోబరు వరకు మూడు నెలల కోటాగా ఒకొక్కరికి 18 కిలోల చొప్పున బియ్యం 11212.257 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. నవంబరులో 3751.330 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. జిల్లాలో 345 రేషన్ దుకాణాలు ఉండగా, 1,97,065 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపరిధిలో 5,79,909 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులు 1,83,012 ఉండగా, లబ్ధిదారులు 5,44,265 మంది, అంత్యోదయ కార్డులు 13,822 ఉండగా, లబ్ధిదారులు 35,391 మంది ఉన్నారు. అన్నపూర్ణ కార్డులు 197 ఉండగా 204 మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా ఆరు రకాల నిత్యావసర సరుకులు కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారం పొడి, చక్కెర, గోధుమపిండి అందించాలని పరిశీలిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కందిపప్పు, ఉప్పు, చక్కెర, నూనె కేజీ చొప్పున, గోధుమలు రెండు కిలోలు, చింతపండు, కారంపొడి 250 గ్రాములు, పసుపు 200 గ్రాములు రేషన్ లబ్ధిదారునికి అందించేవారు. మళ్లీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందించడానికి ఆలోచన చేయడం పేద మద్దతు తరగతి కుటుంబాల్లో ఆసక్తి నెలకొంది.
పేదలపై పెరుగుతున్న ధరల భారం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పవర్‌లూమ్ నేత కార్మిక కుటుంబాలు, దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు ఎక్కువ సంఖ్యలో జీవిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న ధరలు పేద కుటుంబాలకు భారంగా మారింది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో సన్నరకం బియ్యం కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడుగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఏ రకం కూరగాయ కొనుగోలు చేయాలన్నా కిలో రూ.100 పైనే ధర పలుకుతోంది. జిల్లాలో సాధారణంగా ప్రజలు నిత్యం జైశ్రీరామ్(జేఎస్‌ఆర్), బీపీటీ, హెచ్‌ఎంటీ వంటి సన్న రకాల బియ్యం వినియోగిస్తారు. ఇందులో జైశ్రీరామ్ రూ.9 వేలకు చేరుకుంది. బీపీటీ రూ.6500 నుంచి రూ.7వేలు వరకు, హెచ్‌ఎంటి రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముతున్నారు. కిలో బియ్యం రూ.100కు చేరుతుందని భావిస్తున్నారు. కందిపప్పు, నువ్వులు, శనగపప్పు, జిలకర, పల్లీలు, చక్కెర వంటి సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కందిపప్పు రూ.180 కిలో కాగా, నువ్వులు 230, పల్లీలు 180, పెసరపప్పు రూ.140, చక్కెర రూ.60, కందిపప్పు రూ.180 పెరిగింది. దీంతో పాటు టీపొడి, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు, నూనెలు ఇతర వస్తువులపై కూడా 5 నుంచి 20 శాతం ధరలు పెరిగాయి.
జిల్లాలో రేషన్ కార్డులు లబ్ధిదారులు
మండలం కార్డులు లబ్ధిదారులు
బోయిన్‌పల్లి 13,367 37,808
చందుర్తి 12,298 35,512
ఇల్లంతకుంట 17,432 49,547
గంబీరావుపేట 15,969 46,767
కోనరావుపేట 15,741 46,343
ముస్తాబాద్ 16,748 49,607
రుద్రంగి 5,589 17,708
సిరిసిల్ల 30,715 92,445
తంగళ్లపల్లి 16,173 46,562
వీర్నపల్లి 4,835 15,177
వేములవాడ రూరల్ 8,283 24,071
వేములవాడ 22,312 67,010
ఎల్లారెడ్డిపేట 17,603 51,352
మొత్తం 1,97,065 5,79,909