kumaram bheem asifabad- రైతుకు ‘భరోసా’
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:17 PM
జిల్లాలో రైతు భరోసా పథకం అమలు వేగంగా జరుగోతుంది. ఐదు రోజులుగా సొమ్ము రైతు ఖాతాల్లో జమ అవుతుండటంతో అనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆర్థికంగా తోడ్పాటుకు రైతుబంధు పథకానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సాగు సీజన్ సమయంలో ఇవ్వడంతో ఆర్థికంగా దన్ను
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతు భరోసా పథకం అమలు వేగంగా జరుగోతుంది. ఐదు రోజులుగా సొమ్ము రైతు ఖాతాల్లో జమ అవుతుండటంతో అనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆర్థికంగా తోడ్పాటుకు రైతుబంధు పథకానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు ఇవ్వగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ. ఆరు వేలు చేస్తూ రైతుభరోసాగా మార్చింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబందించిన రైతుభరోసా సొమ్ము జమ కార్యక్రమాన్ని జూన్ 30న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఆ రోజు నుంచి రోజుకు ఎకరం చొప్పున శనివారం 6 ఎకరాలు ఉన్నవారికి జమ అయింది.
- వానాకాలం పంటల సాగులో..
ప్రస్తుతం వానాకాలం పంటల సాగులో రైతులు బిజీబిజీగా ఉన్నారు. వరి, పత్తి వంటి ప్రధాన పంటలతో పాటు ఇతర పంటల సాగు ప్రయత్నాల్లో అన్నదాతలు ఉన్నారు. పంటల సాగుకు రైతులు రూ. వేలల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. పెట్టుబడులకు డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధిక వడ్డీలకు ఒంటిపై బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు కూడా గ్రామాల్లో కనిపిస్తాయి. సాగు సీజన్ సమయంలోనే రైతుభరోసా డబ్బులు వేయడంతో అన్నదాతలకు బారీ ఊరటనిచ్చినట్లయింది. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు జమ అవగా కాంగ్రెస్ వచ్చాక పలు అవాంతరాలు ఎదురై కొన్ని సందర్భాల్లో రైతుభరోసా సొమ్ము పంటల సాగు పూర్తయి కోతల దశకు వచ్చాక పడింది. అది కూడా ప్రతి రైతుకు కేవలం రెండు ఎకరాలకు మాత్రమే వేశారు. కానీ ఈసారి మాత్రం సీజన్ సమయంలోనే వేయడంతో ఖర్చులకు ఉపయుక్తంగా మారింది. కాగా జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో శనివా రం వరకు 1,31,636 రైతులకు రూ. 197.90 కోట్లు జమ అయ్యాయి. ఆసిఫాబాద్ నియోజక వర్గంలో 70,918 మంది రైతులకు రూ. 117.31 కోట్లు, సిర్పూర్ నియోజకవర్గంలో 60,718 మంది రైతులకు రూ. 80.59 కోట్లు శనివారం వరకు 6 ఎకరాల వరకు రైతుభరోసా వేయగా మిగతా మూడు రోజుల్లో తొమ్మిది ఎకరాల వరకు రైతుభరోసా వేసే అవకాశం ఉంది.