Share News

చమురు సంక్షోభంతో రోడ్లకు దెబ్బ!

ABN , Publish Date - May 03 , 2026 | 05:03 AM

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతోంది. దీంతో చమురు అనుబంధ ఆధారిత రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చమురు నుంచి ...

చమురు సంక్షోభంతో రోడ్లకు దెబ్బ!

  • భారీగా పెరిగిన తారు ధరలు..

  • యుద్ధం తర్వాత రూ.53 వేల నుంచి 90 వేలకు టన్ను ధర..

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతోంది. దీంతో చమురు అనుబంధ ఆధారిత రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చమురు నుంచి ఉత్పత్తయ్యే తారు ధరలు కూడా అమాంతం పెరిగాయి. రహదారుల నిర్మాణంలో కీలకమైన తారు ధరలు పెరగడంతో దేశంలోని రోడ్ల నిర్వహణ, నిర్మాణ పనులపై ప్రభావం పడనుంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముందు విశాఖపట్నం రిఫైనరీలో మెట్రిక్‌ టన్ను తారు ధర సుమారు రూ.53 వేలు ఉండగా.. ప్రస్తుతం అది 90 వేలకు చేరింది. అంటే దాదాపు 70 శాతం వరకు పెరిగింది. అలాగే రోడ్డు నిర్మాణంలో యంత్రాల నిర్వహణకు వాడే ఎల్‌డీవో (తేలిక రకం డీజిల్‌) ధరలు కూడా పెరగడంతో నిర్మాణ వ్యయం మరింత భారం కానుంది. దీంతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు అనుకూలమైన వేసవిలో వాటి పనులు మందగించనున్నాయి. ప్రతిష్ఠాత్మక భారతమాల పరియోజన, ఇతర పథకాల కింద చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణపై తీవ్ర ప్రభావం పడనుంది. పెరిగిన ధరల కారణంగా కాంట్రాక్టర్లు నాణ్యత లేని తారును వాడే ప్రమాదముంది. ఇక తెలంగాణలో ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిధిలో దాదాపు 25 వేల కిలోమీటర్ల రహదారులు ఉండగా.. 7 మీటర్ల వెడల్పున్న ఒక కిలోమీటరు రోడ్డు మరమ్మతులకు 25 టన్నుల తారు అవసరమవుతుండగా.. అదే కొత్త రోడ్డు నిర్మాణానికి కిలోమీటరుకు 60 టన్నులు పడుతుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా రోడ్ల పనులు కుంటుపడగా.. ఇప్పుడు తారు ధరలు పెరగడంతో మరింత ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రోడ్ల నిర్మాణ, మరమ్మతు ప్రతిపాదనలు, ప్రణాళికలన్నీ తలకిందులవ్వనున్నాయి.

Updated Date - May 03 , 2026 | 05:03 AM