గంజాయి సాగు చేస్తే.. రైతు భరోసా బంద్
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:36 AM
గంజాయి సాగు, రవాణా, అమ్మకాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గంజాయి సాగు చేసే వారికి రైతు భరోసాను ఇవ్వకూడదని నిర్ణయించింది.
ఆసిఫాబాద్ జిల్లాలో 35 మంది రైతులకు నిలిపివేత
ఆసిఫాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గంజాయి సాగు, రవాణా, అమ్మకాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గంజాయి సాగు చేసే వారికి రైతు భరోసాను ఇవ్వకూడదని నిర్ణయించింది. గతంలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన వారికి రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తూ కుమరం భీం జిల్లా కలెక్టర్ హరిత ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొందరు అక్రమార్కులు రైతులకు డబ్బు ఆశ చూపి పత్తి, కంది పంటల్లో అంతర పంటగా గంజాయి సాగు చేయిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఏడాది కాలంగా గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన 35మంది జాబితా(77 ఎకరాల భూమిని)ను ప్రభుత్వానికి పంపించారు. వీరికి రైతు భరోసాను పూర్తిగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ కాగా.. డ్రగ్స్ కంట్రోల్ సమావేశంలో ఈ విషయాన్ని కలెక్టర్ వెల్లడించారు.