Share News

మే నెలలో కోటిన్నర ఇస్తా!

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:07 AM

ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 9.83 కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలను ఎదుర్కొంటున్న సినీనటి కె. వెంకట అశ్విని రెడ్డి అలియాస్‌ అషురెడ్డి కేసులో కీలక పరిణామం వెలుగుచూసింది.

మే నెలలో కోటిన్నర ఇస్తా!

  • జీవితంలో స్థిరపడ్డాక మిగతా డబ్బూ ఇచ్చేస్తా.. ప్రవీణక్క, వేణుస్వామి వద్ద సెటిల్మెంట్‌ చేసుకుందాం

  • కాదూ కూడదన్నావో.. నేనే వేధింపుల కేసు పెడతా

  • ధర్మేంద్రను ఉద్దేశించి అషురెడ్డి బెదిరింపు సందేశం?

  • ఆమెదిగా చెబుతున్న ఓ ఆడియో నెట్‌లో వైరల్‌

  • పెళ్లి పేరుతో రూ.9.83 కోట్లు కొల్లగొట్టి.. కోటిన్నర మాత్రమే ఇస్తాననడం మోసమే: ఎన్నారై ధర్మేంద్ర

  • కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 9.83 కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలను ఎదుర్కొంటున్న సినీనటి కె. వెంకట అశ్విని రెడ్డి అలియాస్‌ అషురెడ్డి కేసులో కీలక పరిణామం వెలుగుచూసింది. బాధితుడైన ధర్మేంధ్ర, అలియాస్‌ వెంకీకి అషురెడ్డి పంపినట్లుగా ఓ ఆడియో సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తీసుకున్న డబ్బులో కోటిన్నర మేనెలలో తిరిగిచ్చేస్తానని, మిగతా డబ్బు తాను ఇవ్వను అని చెప్పడం లేదని.. తాను జీవితంలో స్థిరపడ్డప్పుడు, తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తానంటూ ధర్మేంద్రకు అషురెడ్డి చెబుతున్నట్లుగా ఆ ఆడియో లో ఉంది. ఒకవేళ.. తన ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించకపోతే పెద్దమనుషులైన ప్రవీణక్క (ప్రవీణ-సినీ, టీవీ రియాలిటీ షోల నిర్మాత), వేణుస్వామి సమక్షంలో కూర్చుని మాట్లాడుకుందామని, ఆ ఇద్దరు కాకపోతే.. ఇంకెవరి సమక్షంలోనైనా కూర్చుని మాట్లాడుకునేందుకు తాను సిద్ధమని అషూరెడ్డి ప్రతిపాదిస్తున్నట్లుగా ఆ ఆడియో సందేశంలో ఉంది! కాదు,కుదరదు అంటే గనక ఆయన ముఖం కూడా చూడదల్చుకోలేదని, తన అక్కను, అమ్మను కేసులో ఇన్వాల్వ్‌ చేస్తుండటం, నేరుగా ఇంటికే వస్తానని హెచ్చరిస్తుండటంతో తానే ఆయనపై వేధింపుల కేసు పెడతానని ధర్మేంద్రను ఆమె బెదిరిస్తున్నట్లుగా ఆ సందేశంలో ఉంది. గొడవ మధ్యలోకి తన ఇంట్లోవాళ్లను లాగకుండా.. ప్రవీణ, వేణుస్వామి సమక్షంలో ఇద్దరమే పరిష్కరించుకుందామని ధర్మేంద్రకు అషురెడ్డి ప్రతిపాదిస్తున్నట్లుగా ఆ సందేశంలో ఉంది. మరోవైపు లండన్‌ నుంచి ధర్మేంద్ర ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పెళ్లి పేరుతో అషురెడ్డి తనను నిండా ముంచారని, గత ఎనిమిదేళ్లలో తన నుంచి విడతలవారీగా రూ.9.83 కోట్లు ఆమె కాజేశారని ఆరోపించారు.


తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనతో బంగ్లాలు, కారును ఆమె కొనిపించుకున్నారని.. రెండుసార్లు వివాహ ముహూర్తం ఖరారు చేసుకున్నాక ఆమెనే క్యాన్సల్‌ చేశారని ఆరోపించారు. పెళ్లి చేసుకోకపోవడంతో తన డబ్బు తనకు తిరిగిచ్చేయాలని అడిగితే వేధింపుల కేసు పెడతానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరింపులకు పాల్పడుతున్నారని, వేధింపులు భరించలేకే పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. సెటిల్మెంట్‌ పేరుతో అషురెడ్డి ఏడాదిగా కాలయాపన చేస్తున్నారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన నుంచి అషురెడ్డి సోదరి రూ.75 లక్షలు, అషురెడ్డి తండ్రి రూ.92 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. తన దగ్గర డబ్బు లేకపోయినా బ్యాంకు నుంచి రుణం తీసుకొని మరీ అషురెడ్డికి డబ్బు ఇచ్చానని, ఈ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు సమర్పించానని, వాటిని పరిశీలించాకే వారు కేసు నమోదు చేశారని వివరించారు. తన నుంచి కోట్లలో వసూలు చేసి, ఇప్పుడు కోటిన్నర ఇచ్చి సెటిల్‌ చేస్తామనడం మోసం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. కాగా, అషురెడ్డి నిజంగానే సెటిల్మెంట్‌ పేరుతో కాలయాపన చేశారా?, రాజకీయ, సినీరంగ ప్రముఖుల పేర్లు చెప్పి బాధితుడిని భయపెట్టారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అషురెడ్డి తల్లి కూడా రెండో పిటిషనర్‌గా ఉన్నారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్‌లో సీసీఎస్‌ పోలీసులను, ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తిలను ప్రతివాదులుగా చేర్చారు. తన వాదనలను వినకుండా పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని పిటిషన్‌లో అషురెడ్డి పేర్కొన్నారు. తనపై నమోదైన క్రిమినల్‌ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అషురెడ్డి కోరారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రవీణ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. మరోవైపు, అషురెడ్డిపై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని,. అవసరమైతే అషురెడ్డికి నోటీసులు జారీ చేసి.. ఆమెను విచారణ చేస్తామని డీసీపీ పేర్కొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 07:08 AM