kumaram bheem asifabad- ఆశ్రమ పాఠశాలల్లో అన్నీ సమస్యలే
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:12 PM
గిరిపుత్రులకు భోజనవసతితో పాటు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలపై ఉన్నతాధికారులు నిర్లక్షవైఖరిని అవలంబిస్తుండడంతో పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
- నల్లా నీటితో సరిపెట్టుకుంటున్న వైనం
- చెట్లకింద భోజనాలు..విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
వాంకిడి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గిరిపుత్రులకు భోజనవసతితో పాటు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలపై ఉన్నతాధికారులు నిర్లక్షవైఖరిని అవలంబిస్తుండడంతో పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బోధనపై శ్రద్ధ తీసుకుంటున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అరకొర వసతుల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి పరిస్థితి నెలకొన్నది.
- నిధులు కేటాయిస్తున్నప్పటికీ..
ఆశ్రమ పాఠశాలలకు ఏటా రూ. లక్షల్లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య, పర్యవేక్షణలోపంతో సౌకర్యాల కల్పన కొరవడుతోంది. విద్యాప్రమాణాలు పెంచెందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతున్నా అవి ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదు. మండలంలోని బంబార గిరిజన ఆశ్రమపాఠశాలలో 181 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో సరిపడ భవన సదుపాయం ఉన్నప్పటికీ తాగునీరు, వేడి నీటియంత్రాలు, డైనింగ్‌హాల్ తదితర సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. విద్యార్థులకు తాగు నీరు అందించేందుకు గాను రూ. 2.5 లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంటు చెడిపోయి అలంకార ప్రాయంగా మారాయి. దీంతో విద్యార్థులకు శుద్ధజలం అందని ద్రాక్షలా తయారైంది. దీంతో ప్రతి రోజు విద్యార్థులు నల్లా నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో విద్యార్థుల కు వేడి నిళ్లు అందిం చేందుకు గాను ఏర్పాటు చేసిన సోలార్ వేడినీటి యంత్రాలు చెడిపోయి ఏళ్లు కావస్తున్నా అధికారులు మరమ్మతులు చేయడంలేదు. దీంతో విద్యార్థులు చలికాంలో చన్నీళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పాఠశాలలో డైనింగ్‌హాల్ లేకపోవడంతో పాఠశాల అవరణలోని చెట్ల కిందనీడలో విద్యార్థులు భోజనాలు చేసుకుంటున్నారు. వంటశాల లేకపోవడంతో వంటకాలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
- శుద్ధ జలం లేక..
పాఠశాలలో శుద్ధ జలం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశా లలో ఏర్పాటు చేసిన మోటర్ నీటిని ప్రతి రోజు నేరుగా విద్యార్థులు తాగుతున్నారు. దీంతో అంటువ్యాధులు ప్రబలి అనారోగ్య సమస్యలు ఉత్పన్న మయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఆహారం వికటించి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగాఒక విద్యార్థిని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అధికారులు శుద్ధజలం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
- ఉన్నతాధికారులకు నివేదించాం..
- రాంషావు- ఇన్చార్జి హెచ్ఎం
పాఠశాలలో శుధ్ధల యంత్రాలు చేడిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళ్లాం. వాటిని సకాలంలో మరమ్మతులు చేసి విద్యార్థులకు శుధ్ధజలం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.