రాష్ట్రానికే తలమానికం ఆరుట్ల సర్కారీ బడి
ABN , Publish Date - May 26 , 2026 | 04:47 AM
పిల్లలంతా ఎంచక్కా యూనిఫామ్‌లు వేసుకుని.. బస్సులో ప్రైవేటు బడికి కాకుండా సర్కారీ బడికి వెళ్లడం ఎక్కడైనా చూశారా? ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం..
ప్రభుత్వ బడికి కార్పొరేట్ సొబగులు.. ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన సర్కారీ బడి అంటే చాలా మందికి చిన్నచూపు. పేదలు తప్ప ధనవంతుల పిల్లలు చేరని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా.. ఆమాటకొస్తే దేశవ్యాప్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి. కానీ.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించే లక్ష్యంలో భాగంగా అక్కడ సర్కారు ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఇప్పుడు రాష్ట్రానికే తలమానికంగా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ బడులకు దీటైన విద్యాబోధనతో, ఇతరత్రా సౌకర్యాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పేదల కోసం పెట్టిందే అయినా.. ఆ చుట్టుపక్కల ధనవంతుల పిల్లల అడుగులూ ఇప్పుడు ఆ పాఠశాలవైపే!! అందుకే.. సోమవారం తనను సచివాలయంలో కలిసి రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలపై ముచ్చటించిన సీపీఎం నేతలకు సీఎం రేవంత్.. ‘ఒక్కసారి ఆరుట్లలోని ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను చూసి రండి’ అని సూచించారు!!
విద్యార్థుల కోసం 3 బస్సులు.. ఈ ఏడాది 1000 మందికి ప్రవేశాలు
తమ పిల్లలనూ చేర్పించిన 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు
విద్యారంగ సమస్యలపై.. సీఎంను కలిసిన సీపీఎం నేతల బృందం
ఆరుట్ల స్కూల్‌ను సందర్శించాలని వారికి సూచించిన సీఎం రేవంత్
మంచాల, మే 25(ఆంధ్రజ్యోతి): పిల్లలంతా ఎంచక్కా యూనిఫామ్‌లు వేసుకుని.. బస్సులో ప్రైవేటు బడికి కాకుండా సర్కారీ బడికి వెళ్లడం ఎక్కడైనా చూశారా? ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం.. అలాగే డిజిటల్ తరగతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలను? ఒకే ఏడాది కొత్తగా వెయ్యి మంది పిల్లలు సర్కారీ స్కూల్లో చేరడం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి అద్భుతాలను చూడాలంటే చలో ఆరుట్ల! పేద విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి మండలంలో కనీసం రెండు బడులను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరిట ఏర్పాటు చేసేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాల బడులతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరమే విద్యాబోధన అమలులోకి తెచ్చారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే రీతిలో మౌలిక వసతులు కల్పించి ఈ పాఠశాలను తీర్చిదిద్దారు.

విద్యాప్రగతి పరుగులు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా ఆరుట్లలో ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్‌ను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించారు. ఇందుకు సోషల్ డెమొక్రటిక్ ఫోరం సంస్థ రూ.2 కోట్ల నిధులను విరాళంగా అందించడంతో పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి. అంతేకాకుండా రూ.23 లక్షల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రహరీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులన్నీ పూర్తిచేశారు. జీఎంఆర్ సంస్థ సహకారంతో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ప్రీ ప్రైమరీ పాఠశాలకు అవసరమైన ఆటవస్తువులు, ఫర్నీచర్ సమకూర్చారు. ఫుట్‌బాల్, క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా సుమారు అర ఎకరా స్థలంలో బాక్స్ నెట్ ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల నుంచి విద్యార్థులు చేరుకునేందుకు కాంట్రాక్టు పద్ధతిలో మూడు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగా ప్రీ, ప్రైమరీ స్థాయి నుంచే ఆంగ్లమాధ్యమాన్ని అమలులోకి తీసుకువచ్చారు. డిజిటల్ తరగతుల నిర్వహణకు వీలుగా గదుల్లో మార్పులు చేశారు. నిరుడు ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య 760 కాగా.. ఈసారి కొత్తగా వెయ్యి మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకోవడం విశేషంగా చెప్పవచ్చు. అంతేనా.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 100 మంది తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించడం గమనార్హం. ఈ క్రమంలోనే.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పాఠశాలను సందర్శించారు.