Share News

మూగబోయిన 5 దశాబ్దాల ఉద్యమ గళం

ABN , Publish Date - Jul 04 , 2026 | 07:00 AM

ఐదు దశాబ్దాల పాటు విప్లవ పార్టీల గొంతుకై.. తన ఉద్యమగళంతో ప్రజ ల్లో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నింపిన ‘అరుణోదయ’ నాగన్న ఇకలేరు.

మూగబోయిన 5 దశాబ్దాల ఉద్యమ గళం

  • ఖమ్మంలో కన్నుమూసిన ‘అరుణోదయ’ నాగన్న

  • ఎమర్జెన్సీ నుంచి స్వరాష్ట్ర సాధన దాకా గళం

  • ఆర్‌ నారాయణ మూర్తి సినిమాల్లో గీతరచన

  • నివాళులర్పించిన మాస్‌లైన్‌, పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతలు

ఖమ్మం సంక్షేమ విభాగం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఐదు దశాబ్దాల పాటు విప్లవ పార్టీల గొంతుకై.. తన ఉద్యమగళంతో ప్రజ ల్లో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నింపిన ‘అరుణోదయ’ నాగన్న ఇకలేరు. అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారంలో పరకాల పాపయ్య లక్ష్మమ్మ దంపతులకు రెండో సంతానంగా 1957లో జన్మించిన నాగయ్య.. చిన్న తనంలో గ్రామంలోని ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేశాడు. పశువులు కాస్తూనే జానపదాలపై మక్కువ పెంచుకున్న నాగయ్య.. సీపీఐ ఎంఎల్‌ పార్టీ ఉద్యమ స్ఫూర్తికి ఆకర్షితులయ్యారు. ఆ పార్టీలో చేరి తన పనితీరుతో కీలకంగా మారారు. 1970 నుంచి విప్లవ గేయకళాకారుడిగా తన గళాన్ని వినిపించిన నాగయ్య విప్లవ పార్టీల బహిరంగ సభల్లో కంచుకంఠంతో ప్రజలను తనవైపునకు తిప్పుకొనేవారు. సీపీఐ ఎంఎల్‌ పార్టీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో కీలకంగా పనిచేసి ‘అరుణోదయ’ నాగయ్యగా గుర్తింపు పొందరు. ఇక రామనర్సయ్య స్ఫూర్తితో దేశంలో జరిగిన ఎమర్జెనీ పోరాటంలో రహస్యంగా ఉండి సాంస్కృతిక గేయాలకు ఊపిరి పోసిన నాగయ్య గళం.. తన గ్రామానికి చెందిన శ్రీపాద శ్రీహరి, రామనర్సయ్య ఎన్‌కౌంటర్‌ తర్వాత ఒక ఉప్పెనగా మారింది.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పనిచేశారు. డప్పు, బుర్రకథ, కోలాటం, పాటలు గేయాలు, రాయటంపై సాంస్కృతిక కళాకారులకు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దర్శక, నిర్మాత, నటుడు ఆర్‌ నారాయణమూర్తి తీసిన కొన్ని సినిమాలకు గీతాలను రాసి ఆలపించారు. దండోరా సినిమాలో ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా.. కొడవలి చేపట్టవే చెల్లెమ్మా’.. ‘కంపెనీ కూలోళ్లు కపడం ఎరుగనోళ్లు.. సారాయికి మరిగి కొంపముంచిండు’... ఛలో అసెంబ్లీ సినిమాలో ‘ఆగదు.. ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు. మీ దోపిడీ పాలన సాగదు’ అనే పాటలను నాగన్న రాశారు. నాగన్నకు భార్య లక్ష్మక్క, కుమారుడు అజయ్‌ ఉన్నారు. అజయ్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ సాంస్కృతిక కళాకారుడిగా ఖ్యాతి పొందారు. నాగన్న భౌతికకాయాన్ని ఖమ్మంలోని మాస్‌లైన్‌ కార్యాలయం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి తరలించారు. అక్కడ మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సహా పలు పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు నివాళులర్పించారు.

Updated Date - Jul 04 , 2026 | 07:03 AM