Share News

కళతప్పిన బతుకులు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:06 AM

మఠంపల్లి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఎంతోమంది ప్రజలకు తమ కళల ద్వారా వినోదం, ఆనందం కల్పించే రంగస్థల కళాకారులకు నేడు ఆదరణ కరువైంది.

 కళతప్పిన బతుకులు

సినిమాలు, టీవీ షోల ప్రభావంతో

ఉనికి కోల్పోతున్న కళాకారులు

ఫ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాలు

ఫ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

మఠంపల్లి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఎంతోమంది ప్రజలకు తమ కళల ద్వారా వినోదం, ఆనందం కల్పించే రంగస్థల కళాకారులకు నేడు ఆదరణ కరువైంది. నాటి చరిత్ర ఇతిహాస పురాణాలే కాకుండా సమాజంలో నెలకొంటున్న పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సాంఘిక, పౌరాణిక, బుర్రకథ, జానపదాలతో ప్రజలకు చైతన్యవంతులు చేయ డానికి కళా ప్రదర్శనలు ఇచ్చిన కుటుంబాలు నేడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మార్పులు తట్టుకుంటూనే రంగస్థలాన్ని కాపాడుకుంటూ గ్రామాలు, పట్టణాల్లో సైతం స్టేజీలపై తమ సొంత ఖర్చులు, కొంతమేర దాతల సహకారంతో నాటకాలు ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సమాజంలో అనేక రంగాల వారికి వివిధ రూపాల్లో ఆదుకుంటున్నా రంగస్థల కళాకారుల ప్రదర్శనలకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోనే సుమారు 2000 మందికి పైగా కళాకారులు సుమారు 120 నాటక సమాజాలను రిజిస్టర్‌ చేయించుకొని తమ సొంత ఖర్చులతో సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ, చింతామణి, శ్రీకృష్ణరాయభారం, రామాంజనేయ యుద్ధం, పల్నాటి యుద్ధం తో పాటు ఇతర నాటకాలను ప్రదర్శిస్తున్నారు. గతంలో ప్రభుత్వం పలురకాల కార్యక్రమాలకు జనాభా నియంత్రణ, మద్యపానం, చదువు వెలుగు, పుష్కరాలు తదితర కార్యక్రమాలను కళాకారులతో జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా పనులు కల్పించేవారు. సుమారు పదేళ్లుగా ప్రభుత్వం నుంచి కళాకారుకు ఎలాంటి ఆదరణ దక్కడం లేదు. ముఖ్యంగా రంగస్థల కళాకారులకు కేంద్రం రూ.6వేలు, రాష్ట్రం రూ.3వేలు చొప్పున ఫింఛన్లు ఇచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా, కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఫింఛన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో 200మంది కళాకారులకు మాత్రమే పింఛన్లు మంజూరైన వారు ఉన్నారు. కొత్త పింఛన్ల కోసం కళాకారుల యూనియన్‌ నాయకులు పలుమార్లు హైదరాబాద్‌, ఢిల్లీ వరకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు నిరుపేద రంగస్థల కళాకారులకు పింఛన్లు, ఇళ్లు, రైలు, బస్‌పాసులు, హెల్త్‌కార్డులు, సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేయాలని పలువురు కోరుతున్నారు.

పేద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

పేదరికంలో ఉన్న కళాకారులను ప్రభు త్వం ఆర్థికపరంగా ఆదుకోవాలి. ప్రభుత్వం సమాజ హితం కోసం ఏళ్ల తరబడి పని చేస్తున్న కళాకారులను పాలకులు పట్టించుకోకపోవడం సరికాదు. వెంటనే అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసి వారి సంక్షేమానికి నిధులు విడుదల చేయాలి.

- భోనగిరి ప్రకా్‌షబాబు, కళాకారుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు

పదేళ్లుగా పట్టించుకోవడం లేదు

గతంలో ప్రభుత్వం నిర్వహించే పలురకాల కార్యక్రమాలకు కళాకారులతో జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా పనులు కల్పించేవారు. సుమారు పదేళ్లుగా ప్రభు త్వం నుంచి కళాకారులు ఎలాంటి ఆదరణ దక్కడం లేదు. నిరుపేద రంగస్థల కళాకారులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలి.

- భద్రంరాజు వెంకటరామారావు, కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

రంగస్థల కళాకారులను గుర్తించాలి

ఎంతోమంది ప్రజలకు తమ కళల ద్వారా వి నోదం, ఆనందం పంచిన పంచుతున్న రంగస్థల కళాకారులను ప్రభుత్వాలు గుర్తించాలి. అంతరించిపోతున్న రంగస్తల నాటకాలను బతికించేందు కు, పూర్వవైభవం తెచ్చేందుకు ఆనాటి చరిత్ర ఇతిహాస పురాణాలే కాకుండా సమాజంలో నెలకొంటున్న పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కళా ప్రదర్శనలు చేస్తున్న రంగస్ధల కళాకారులను సంక్షేమ ఫలాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలి.

- గుంటి పిచ్చయ్య, కళాకారుల సంఘం జిల్లా నాయకుడు

Updated Date - Apr 09 , 2026 | 12:06 AM