పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరత
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:40 AM
రాష్ట్రంలో మళ్లీ పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరత తలెత్తుతోంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన ఆయిల్ కంపెనీలు స్వార్థపూరితంగా ...
సరఫరాలో ఆయిల్ కంపెనీల అరాచకం.. రాష్ట్రంలోని ఔట్‌లెట్‌లకు అరకొరగా సప్లై
డీలర్లు ఇండెంట్ పెట్టిన 3-4 రోజుల తర్వాత బంకులకు చేరుతున్న ట్యాంకర్లు
1000-1200 బంకుల్లో నోస్టాక్ బోర్డులు
సప్లయ్ చైన్ పద్ధతికి గండికొడుతూ..
ఆన్-ఆ్‌ఫ పద్ధతి అమలు చేస్తున్న కంపెనీలు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరత తలెత్తుతోంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన ఆయిల్ కంపెనీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ కొరత ఓవైపు వేధిస్తుండగా.. మరోవైపు అందుబాటులో ఉన్న ఇంధన వనరులను కూడా వినియోగదారులకు చేర్చకుండా ఆయిల్ కంపెనీలు అరాచకానికి పాల్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోలు, డీజిల్ బంకులకు 3-4 రోజులకోసారి మాత్రమే ట్యాంకర్లను పంపిస్తున్నాయి. దీంతో రోజువారీ విక్రయాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ రాక.. డీలర్లు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఇలా రోజుకు సగటున 1000-1200 బంకులు మూతపడి ఉంటున్నాయి. దీంతో వాహన చోదకులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,200 పెట్రోలు బంకులున్నాయి. వీటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) కంపెనీలు పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తుంటాయి. రోజుకు సగటున 5,883 కిలోలీటర్ల పెట్రోలు, 7,348 కిలో లీటర్ల డీజిల్‌ను సరఫరా చేస్తాయి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పెట్రోలు, డీజిల్ కొరత రావడంతో సరఫరాలో భారీ తేడాలొచ్చాయి. నెలరోజులుగా సరఫరా 2-3రెట్లు పెంచినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లెక్కలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నా యి. సాధారణ పరిస్థితుల్లో ఇండెంట్ పంపిన వెంటనే ట్యాంకర్లు వచ్చి బంకుల వద్ద వాలిపోయేవి. కానీ, ఇప్పుడు ఇండెంట్ పెట్టిన 3-4 రోజుల తర్వాత కూడా ట్యాంకర్లు రావడంలేదు. దీంతో బంకుల్లో స్టాక్ ఉన్నంతవరకు విక్రయించి.. ఆ తర్వాత నో-స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇలా రోజుకు 25-30 శాతం పెట్రోలు బంకులు మూత పడుతున్నాయి. గతం లో క్రెడిట్ సిస్టమ్ ఉండేది. బంకులకు పెట్రోలు, డీజిల్ సరఫరా చేసిన తర్వాత కొంత సమయమిచ్చి ఆయిల్ కంపెనీలు డబ్బులు తీసుకునేవి. ఆ పద్ధతికీ ఇటీవ ల స్వస్తి చెప్పాయి. ముందు డబ్బులిచ్చి ఇండెంట్ పెడితేనే.. స్టాక్ సరఫరా చేస్తున్నాయి. పైగా, ఇండెంట్ పెట్టి, డబ్బులు జమచేసిన తర్వాత 3-4రోజులకు కూడా ట్యాంకర్లను పంపడంలేదు. రోజుకు 25- 30 శాతం బంకులు మూతపడేలా, విక్రయాలు ఆమేరకు తగ్గేలా ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి.
నష్టాలపాలవుతున్న డీలర్లు..
ఆయిల్ కంపెనీలు నష్టాలను తగ్గించుకోవటానికి కృత్రిమ కొరత సృష్టిస్తుంటే.. పెట్రోలు బంకుల డీలర్లు నష్టాల్లో మునుగుతున్నారు. ముందస్తుగా ఇండెంట్, డబ్బులు చెల్లించినందుకు వడ్డీ నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్, రవాణా, సిబ్బందికి వేతనాలు, నిర్వహణ ఖర్చు లు, పెట్టుబడి తప్పడంలేదని ఆందోళన చెందుతున్నా రు. అరకొరగా స్టాక్ సరఫరా చేస్తుండటంతో 2 రోజులు అమ్ముతూ, 3రోజులు బంకులు మూసివేయాల్సి వస్తోందని రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రతి బంకులో అండ ర్‌గ్రౌండ్ ట్యాంకర్లున్నాయి. ఆటోమేటిక్ మెషిన్ ఏర్పాటు చేయడంతో 2వేల లీటర్ల నిల్వలుండగానే పెట్రోలు, డీజిల్ బయటకు రావటంలేదు. ఈ డెడ్ స్టోరేజీ కెపాసిటీని తీసేస్తే.. ఆ 2వేల లీటర్లను ఒక్కరోజైనా విక్రయించటానికి వీలుంటుందని అమరేందర్‌రెడ్డి తెలిపారు.
అన్నదాతలు, వాహనచోదకుల అవస్థలు..
కృత్రిమ కొరతతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బంకులపై ఆయిల్ కంపెనీలు మరింత శీతకన్ను వేశాయి. వారానికి ఒకటి, రెండు ట్యాంకర్లు కూడా సరఫరా చేయడంలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వరికోతల సీజన్ నడుస్తోంది. యాసంగి వరిపంట చేతికి వచ్చింది. ప్రస్తుతం 99శాతం వరికోతలు హార్వెస్టర్లతోనే చేస్తున్నారు. కానీ, హార్వెస్టర్లకు డీజిల్ సరిపడా లేకపోవడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో హార్వెస్టింగ్ చేయకపోతే.. లోపల ఉన్న బియ్యం గింజలు విరిగిపోయి నూకలుగా మారే ప్రమాదం ఉంది. పైగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు, మార్కెట్‌కు తరలించడానికి ట్రాక్టర్లు, లారీ లు, ట్రక్కులకు కూడా డీజిల్ కొరత ప్రతిబంధకంగా మారిందని రైతులు, వాహన డ్రైవర్లు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు మరీ తక్కువగా..
ఆయిల్ కంపెనీలు గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక రకంగా, ఇతర పట్టణ ప్రాంతాల్లో మరో రకంగా, గ్రామీణ ప్రాంతాల్లోని బంకులకు మరీ తక్కువగా ఐదారు రోజులకు ఒక ట్యాంకర్‌ను పంపిస్తున్నాయి. సగటున ప్రతి ఔట్‌లెట్ 2-3 రోజులు మూతపడి ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. పెట్రో ధరలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుండటంతో.. తాము నష్టపోవాల్సి వస్తోందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. లీటరుకు కనీసం రూ.30-40 వరకు నష్టం వస్తోందంటున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇప్పుడున్న ధరలపై రూ.10 నుంచి రూ.15లు పెంచాలని కోరుతున్నాయి. ధరలు పెంచేంతవరకు ఇదే పద్ధతిలో అరకొరగా పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తామని చెప్పకనే చెబుతున్నాయి.
రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు
పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
రాష్ట్రంలో ఇంధన కొరత లేదని... పెట్రోలు, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 25న(శనివారం) రాష్ట్రవ్యాప్తంగా 9,574 కిలోలీటర్ల పెట్రోలు, 14,457కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు ఆదివారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఒక్క రోజులోనే 24,031 కిలో లీటర్ల ఇంధనం సరఫరా చేసినట్లు తెలిపారు. అదే క్రమంలో శనివారం రోజున ఐవోసీఎల్ కంపెనీ నుంచి 1,02,760, హెచ్‌పీసీఎల్ నుంచి 76,004, బీపీసీఎల్ నుంచి 43,998 వంట గ్యాస్ సిలిండర్లు కలిపి మొత్తం ఒక్క రోజులో 2,22,762 సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేసినట్లు చెప్పారు. రాష్ట్రం లో ఎక్కడా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని, ఏవైనా సమస్యలుంటే హెల్ప్‌లైన్ నెంబరు 1967కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.