మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో అరెస్టు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:07 AM
బాలికపై లైంగిక దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అడ్డగూడూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బాలికపై లైంగిక దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు ఆదివారం విలేకరులకు తెలిపారు. అడ్డగూడూరు మండలకేంద్రానికి చెందిన బాలెంల చైతన్య(22) హైదరాబాదులోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొంతకాలంగా అడ్డగూడూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం బాలిక ఉంటున్న ఇంటి గోడ దూకి లోపలికి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక అమ్మమ్మ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో చైతన్యపై పోక్సో కేసు నమోదుచేసిన ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 13వ తేదీన భువనగిరి భరోసా కేంద్రంలో మహిళా ఎస్‌ఐ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. చైతన్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. వాంగ్మూలం నమోదుచేసిన అనంతరం బాలికను హైదరాబాద్ మలక్‌పేటలోని ఆమె పిన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి చైతన్య మలక్‌పేటలో ఉన్న బాలికను తీసుకువెళ్లాడు. బాలిక పిన్ని ఫిర్యాదు మేరకు నింతుడిపై మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. నిందితుడి కోసం అడ్డగూడూరు, మలక్‌పేట పోలీసులు గాలిస్తున్నారు. బాలికను చైతన్య ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి తీసుకువెళ్లి తిరిగి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్ సమీపంలో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని చైతన్యను నల్లగొండ సబ్‌జైలుకు, బాలికను సంరక్షణ నిమిత్తం భువనగిరి సఖి కేంద్రానికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.