kumaram bheem asifabad- పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:00 PM
జిల్లా కేంద్రంలో 15వ తేదీన నిర్వహించే పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వేడుకల నిర్వహణపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో 15వ తేదీన నిర్వహించే పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వేడుకల నిర్వహణపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పోలీసు గౌరవ వందనం, పతాకావిష్కరణ, వేదిక అలంకరణ, స్టాల్స్ ఏర్పాట్లు, శకటాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అందించే ప్రశంసపత్రాల కోసం ప్రతి శాఖ నుంచి ఒకరు, ఇద్దరు జాబితాను ఈనెల 12లోగా అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతున్నందున వరిసాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దంగా ఉంచాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ తో కలిసి అన్నిజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగు, స్మార్ట్‌కార్డుల జారీ, వనమహోత్సవం, వాతావరణ పరిస్థితులపై సమీక్షించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణు తదితరులు పాల్గొన్నారు.
ప్రీ ప్రైమరీ విద్యను మరింత బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు ఆటపాటలతో కూడిన ఆనందదాయకమైన అభ్యసన వాతావరణం కల్పించి ప్రీ ప్రైమరీ విద్యను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. ప్రీ ప్రైమరీ సెక్షన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌లో శుక్రవారం ప్రారంభమైన ఒకరోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చిన్నారుల తొలి విద్యాభ్యాస దశ వారి భవిష్యత్ విద్యకు పునాది వంటిదన్నారు. ప్రీ ప్రైమరీ దశలో పిల్లలపై చదువు ఒత్తిడి లేకుండా, ఆటలు, పాటలు, కథలు, సంభాషణలు, చిత్రలేఖనం, వివిధ కార్యకలాపాల ద్వారా నేర్చుకునే అవకాశాలను కల్పించాలని చెప్పారు. పిల్లలు పాఠశాలకు రావడానికి ఆసక్తిచూపేలా సురక్షితమైన, సంతోషకరమైన అభ్యసన వాతావరణాన్ని ప్రతీ పాఠశాలలో హెచ్‌ఎంలు కల్పించాలని సూచించారు. ప్రతీచిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి వయస్సు, ఆసక్తి, అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్రీ ప్రైమరీ విద్యలో బలమైన పునాది వేయడం అత్యంత ముఖ్యమని, ఈ దశలో పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సంఖ్యా భావనలు, పరిశీలన, ఆలోచన, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి హెచ్‌ఎంలు ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానందచారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మహేశ్వర్, రిసోర్స్‌పర్సన్లు శంకర్, ఝాన్సీ, వెంకటేష్ పాల్గొన్నారు.