Share News

kumaram bheem asifabad- శివరాత్రి జాతరకు ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 14 , 2026 | 10:00 PM

మండలంలోని ఈసుగాంలో ఆదివారం నిర్వహించే మహా శివరాత్రి జాతరకు ఈసుగాం శివమల్లన్న ఆలయం ముస్తాబైంది. మహశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు

kumaram bheem asifabad- శివరాత్రి జాతరకు ఏర్పాట్లు
విద్యుత్‌ దీపాలతో అలంకరించిన శివాలయం

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఈసుగాంలో ఆదివారం నిర్వహించే మహా శివరాత్రి జాతరకు ఈసుగాం శివమల్లన్న ఆలయం ముస్తాబైంది. మహశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సిర్పూరు నియోజకవర్గంలోనే అతి పెద్ద జాతర కావడంతో దాదాపు 2వేల మందికిపైగా భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. సహజసిద్ద భస్మరేఖలతో శివలింగం ఉండడం ఇక్కడి ప్రత్యేకత. సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, దహెగాం, కాగజ్‌నగర్‌ పట్టణం, మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు రానున్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని శివాలయాన్ని విద్యుత్‌ కాంతులతో అలంకరించి సుందరంగా తయారు చేశారు. ఆలయంలోని మూడు ముఖ ద్వారాలవైపు విద్యుత్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. ఆదివారం నిర్వహించే జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సాయత్రం ఐదు గంటలకు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించడానికి రథాలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఆసిఫాబాద్‌ ఆర్‌టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఆర్‌టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటణలు జరుగకుండా సీఐ సత్యనారా యణ, ఎస్సై మహెందర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ గాదే ప్రవీణ్‌ తెలిపారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలోని నంబాల గ్రామంలోని ప్రసన్న పరమేశ్వరాలయంలో ఆదివారం నిర్వహించే జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిద్దెంకి సత్తయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుం టున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆసిఫాబాద్‌, కాగజ్‌ణగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. జాతరలో ఎడ్లబండ్ల ప్రత్యేక ఆకర్షిణీయంగా నిలుస్తాయి. ఆదివారం రథోత్సవం, కల్యాణం నిర్వహిస్తారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆదివారం నిర్వహించే శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శివాలయాలు అన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఆసిఫాబాద్‌లోని సందీప్‌నగర్‌లో గల శివాలయంతో పాటు చిర్రకుంట గ్రామంలోని శివమల్లన్న ఆలయం, బూర్గుడ గ్రామంలో ఉన్న శివాయలం, గుండెలోని శివాలయంతో పాటు మరికొన్ని చోట్ల శివ లింగాలు ఉన్న ప్రాంతాల్లో ఆయలాలను ముస్తాబు చేస్తున్నారు. ఆయా ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శివపార్వతుల కల్యాణం, రాత్రి నుంచి ఉద యం వరకు భజన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రంగనాయక, శివాలయం, హను మాన్‌, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఆది, సోమవారాల్లో నిర్వహించే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేష్‌ తెలిపారు. ఆలయాలకు రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి తరలి వచ్చి పూజలు చేస్తారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాంలో శివకేశవాలయం, లగ్గాం ఉమాచంద్రశేఖర ఆలయం, కుంచవెల్లిలో రామలింగేశ్వర ఆలయం, అయినం శివాలయాలు ముస్తాబ య్యాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివపార్వతుల కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 10:00 PM