kumaram bheem asifabad- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:45 PM
జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో ఆదివారం నిర్వహించే గణతంత్ర వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు గణతంత్ర వేడుకలు నిర్వహించే ఏఆర్ హెడ్ క్వార్టర్‌లోని పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాలు తమ తమ శాఖల అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన శకటాలను తీర్చిదిద్దుతున్నారు.
- ముస్తాబయిన పరేడ్ గ్రౌండ్
- సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ నిర్వహణకు ముమ్మరంగా సాధన
ఆసిఫాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో ఆదివారం నిర్వహించే గణతంత్ర వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు గణతంత్ర వేడుకలు నిర్వహించే ఏఆర్ హెడ్ క్వార్టర్‌లోని పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాలు తమ తమ శాఖల అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన శకటాలను తీర్చిదిద్దుతున్నారు. గణతంత్ర వేడుకల్లో తనదైన ముద్రవేసే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం తన బలగాలతో గత మూడు రోజులుగా కవాతు రిహార్సల్స్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నికితా పంత్ ఆధ్వర్యంలో బలగాలకు కవాతు సందర్భంగా అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించనుండడంతో పరేడ్ మైదానంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రదర్శనలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో వివిధ పథకాలకు సంబంధించి స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులకు వేడుకల సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. కాగా జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ విభాగాలైన అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యావన, విద్యాశాఖ, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి పారుదల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖలకు చెందిన స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పలు శాఖలకు చెందిన శకటాలు తమ ప్రగతిని చాటేలా చర్యలు తీసుకుంటున్నారు.
కార్యక్రమాలు ఇలా..
గణతంత్ర వేడుకలను పురష్కరించుకొని ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కె హరిత చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 9:05 నుంచి 9:10 వరకు కలెక్టర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 9:10 నుంచి 9:20 వరకు మార్చ్ పరేడ్ నిర్వహించనున్నారు. 9:20 నుంచి 9:35 వరకు జిల్లా కలెక్టర్ సందేశం, 9:35 నుంచి 9:45 వరకు శకటాల ప్రదర్శణ ఉంటుంది. 9:45 నుంచి 10:10 వరకు సాంస్కృతిక ప్రదర్శనలు, 10:10 నుంచి 10:50 వరకు ప్రశంసాపత్రాల ప్రదానం, 10:50 నుంచి స్టాల్స్ సందర్శన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు కలెక్టరేట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.