Share News

గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:37 PM

బెల్లంపల్లి పట్టణంలో గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. వినాయకుల నిమజ్జనం జరిగే పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను డీసీపీ పరిశీలించారు.

గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల గురించి సూచనలు ఇస్తున్న డీసీపీ భాస్కర్‌

బెల్లంపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి పట్టణంలో గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. వినాయకుల నిమజ్జనం జరిగే పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను డీసీపీ పరిశీలించారు. విగ్రహాలు వెళ్లే మార్గం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డీసీపీ మాట్లాడుతూ నిమజ్జన శోభా యాత్ర సజావుగా సాగేందుకు శోభాయాత్ర మార్గంలో ఉన్న గుంతలను తా త్కాలికంగా పూడ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్‌ కమీషనర్‌, చైర్‌పర్సన్‌లను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో తగినంత వెలుతురు ఉండేలా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. చెరువులో డ్రెడ్జింగ్‌ ద్వారా లోతును పెంచడంతో పాటు అవసరమైన ఇతర ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ తరుపున మూడు షిప్టుల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద చిన్న పిల్లలు, వృద్దులు, ఈతరాని వ్యక్తులు వెళ్లకుండా నిర్వహకులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నిమజ్జన పాయింట్లను జియోట్యాగింగ్‌ చేసి అధికారులు పగలు, రాత్రి వేళల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పోలీసు శాఖ నిబంధనలు పాటించాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. డీసీపీ వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వాతి, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్‌, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ హనోక్‌, బెల్లంపల్లి టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:37 PM