kumaram bheem asifabad-భీం వర్ధంతి సభకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Oct 25 , 2026 | 10:11 PM
గిరిజన పోరాట యోధుడు కుమురం భీం 86వ వర్థంతి సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశారు. హట్టి బేస్ క్యాంపు నుంచి జోడాఘాట్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించనున్నారు. అలాగే ఆర్‌డబ్యుఎస్ పంచాయతీరాజ్‌తో పాటు పలు శాఖల అధికారులు గత కొన్ని రోజులుగా జోడేఘాట్ వర్థంతి నిర్వహణ సభపై ప్రత్యేక దృష్టి సారించి షామియానాలు, తదితర ఏర్పాట్లు చేశారు.
కెరమెరి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన పోరాట యోధుడు కుమురం భీం 86వ వర్థంతి సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశారు. హట్టి బేస్ క్యాంపు నుంచి జోడాఘాట్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించనున్నారు. అలాగే ఆర్‌డబ్యుఎస్ పంచాయతీరాజ్‌తో పాటు పలు శాఖల అధికారులు గత కొన్ని రోజులుగా జోడేఘాట్ వర్థంతి నిర్వహణ సభపై ప్రత్యేక దృష్టి సారించి షామియానాలు, తదితర ఏర్పాట్లు చేశారు. కాగా జోడేఘాట్ వర్థంతి సభకు ముందుగా ఆదివారం అవ్వల్ పెయిన్ పూజ కార్యక్రమాన్ని భీం మనుమడు సోనేరావు చేశారు. ఈ సందర్భంగా భీం సమాధి వద్ద కుమరం వంశీయులు భీం మనుమలు, మనురాలు, ఇతర గిరిజన సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సంప్రదాయబద్ధంగా ఈ పూజ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టారు.
మంత్రుల రాక
ఆసిఫాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలంలోని జోడేఘాట్‌లో సోమవారం నిర్వహించే కుమరంభీం 86వ వర్థంతి వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హజరుకానున్నారు. మంత్రి సీతక్క ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జోడేఘాట్‌కు చేరుకోనున్నారు. అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జోడేఘాట్‌కు చేరుకొని మంత్రి సీతక్కతో కలిసి కుమరంభీం వర్థంతి వేడుకల్లో పాల్గొంటారు. కుమరం భీంకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్క నిజామాబాద్‌కు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్ల చేశాం
కెరమెరి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ పోరాట యోధుడు భీం వర్థంతి కార్యక్రమం నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టు ఎస్పీ నితికాపంత్ అన్నారు. స్థానికంగా ఆదివారం సాయంత్రం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏడు సెక్టార్లుగా బందోబస్తును విభజించినట్టు తెలిపారు. ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణ, తొమ్మిది సీఐలు, 40 మంది ఎస్సైతో సహా 600 మంది సిబ్బంది భద్రత విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు అవసరమైన పోలీసు సహాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అన్ని ముందస్తు భద్రత చర్యలు చేపట్టామని తెలిపారు.