Share News

బడిలో ఉర్దూ బోధనతో రగిలిన ఆర్మూర్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:01 AM

ఓ ప్రైవేట్‌ పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధించడంతో పాటు నమాజ్‌ చేయిస్తున్నారనే ఆరోపణలతో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మూడురోజులుగా అట్టుడుకుతోంది.

బడిలో ఉర్దూ బోధనతో రగిలిన ఆర్మూర్‌

  • ఓ ప్రైవేటు పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధించి, నమాజ్‌ చేయిస్తున్నారని ఆరోపణలు

  • బీజేపీ, హిందూ సంఘాల ఆందోళనలతో ఉద్రిక్తత

  • ఆర్మూర్‌కు రాకుండా స్థానిక ఎమ్మెల్యేను భిక్కనూర్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు.. పలువురు బీజేపీ నేతల అడ్డగింత

  • ప్రిన్సిపాల్‌ను కొట్టిన బీజేపీ నేత అరెస్ట్‌.. బెయిల్‌పై విడుదల

ఆర్మూర్‌ టౌన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేట్‌ పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధించడంతో పాటు నమాజ్‌ చేయిస్తున్నారనే ఆరోపణలతో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మూడురోజులుగా అట్టుడుకుతోంది. హిందూ సంఘాల ర్యాలీలు, ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్‌పై బీజేపీ నాయకులు కావాలనే దాడిచేశారంటూ.. ఆదివారం బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించగా.. బీజేపీ నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ బీజేపీ, హిందూ సంఘాల నేతలు సోమవారం ఆర్మూర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. పాఠశాలలో ఊర్దూ బోధనను నిరసిస్తూ ప్రిన్సిపాల్‌పై చేయిచేసుకున్న బీజేపీ ఆర్మూర్‌ (పట్టణ) అధ్యక్షుడు మందుల బాలు, నూతుల శ్రీనివా్‌సతోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో మందుల బాలును సోమవారం అంకాపూర్‌లో.. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి నివాసంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి బెయిల్‌ మంజూరు చేశారు. మూడు రోజుల క్రితం.. ఆర్మూర్‌ మునిసిపాలిటీ పరిధి పెర్కిట్‌లోని భరత్‌చంద్ర ఉన్నత పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధించడంతో పాటు నమాజ్‌ చేయిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకోగా.. ప్రిన్సిపాల్‌ అమీర్‌ఖాన్‌పై బీజేపీ నాయకులు చేయిచేసుకున్నారు. అనంతరం పోలీసులు కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆదివారం ముస్లిం సంఘాల ప్రతినిధులు పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టి.. ప్రిన్సిపాల్‌పై దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కేవలం బీజేపీ నాయకులపైనే కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది.


ఆర్మూర్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు.. బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు భరత్‌చంద్ర స్కూల్‌ వద్ద బైఠాయించారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని భిక్కనూరు వద్ద అడ్డుకోవడంతో ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుకు నిరసనగా రోడ్డుపైన తన వాహనాన్ని ఆపి.. అందులో నుంచి దిగకుండా లోపలే కూర్చున్నారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున భిక్కనూర్‌ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఆర్మూర్‌ ఏసీపీ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ, హిందూ సంఘాల నాయకులను కూడా అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. భరత్‌చంద్ర ఉన్నత పాఠశాల గుర్తింపును రద్దుచేయాలని, ఉర్దూ బోధించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. కాగా.. బంద్‌ సందర్భంగా ఆర్మూర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు సెక్షన్‌ 163 బీఎన్‌ఎ్‌సఎ్‌సను అమలుచేస్తున్నట్లు పోలీసు కమీషనర్‌ సాయిచైతన్య వెల్లడించారు.

Updated Date - Jun 30 , 2026 | 05:01 AM