Share News

తుపాకీతో కాల్చి.. 6 లక్షలు దోపిడీ

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:34 AM

ఇద్దరు దుండగులు.. దోపిడీ కోసం పక్కాగా స్కెచ్‌ వేశారు.. బ్యాంకు నగదు డిపాజిట్‌ యంత్రం (సీడీఎం)లో జమ చేయడానికి వచ్చిన వ్యాపారిపై కాల్పులు జరిపి..

తుపాకీతో కాల్చి.. 6 లక్షలు దోపిడీ

  • కోఠిలోని ఎస్‌బీఐ సీడీఎంలో డిపాజిట్‌కు వెళ్లిన వ్యాపారి

  • కాల్పులు జరిపి డబ్బుతో అతని స్కూటీపైనే పరార్‌

  • ఘటనలో ఇద్దరు దుండగులు.. ఆస్పత్రిలో బాధితుడు

హైదరాబాద్‌/ అఫ్జల్‌గంజ్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు దుండగులు.. దోపిడీ కోసం పక్కాగా స్కెచ్‌ వేశారు.. బ్యాంకు నగదు డిపాజిట్‌ యంత్రం (సీడీఎం)లో జమ చేయడానికి వచ్చిన వ్యాపారిపై కాల్పులు జరిపి.. రూ.6 లక్షల నగదుతో వ్యాపారి స్కూటీపైనే పారిపోయారు. హైదరాబాద్‌లోని కోఠిలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగిం ది. కాల్పుల్లో కుడికాలిగి తీవ్రగాయమైన వ్యాపారిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సుల్తాన్‌బజార్‌, ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కజికోడ్‌కు చెందిన రిన్షాద్‌ పి.వి. (26) బంధువుతో కలిసి అక్కడ రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. రెండు నెలలకోసారి హైదరాబాద్‌కు వచ్చి దివాన్‌ దేవిడీలో హోల్‌సేల్‌ దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం రిన్షాద్‌ డబ్బులు తీసుకొని హైదరాబాద్‌కు వచ్చారు. నాంపల్లిలోని ఓ అపార్టుమెంట్‌లో స్నేహితుడు అమీర్‌ ఫ్లాట్‌లో బస చేశాడు. కొత్త స్టాక్‌ లేకపోవడం, తాము కోరిన దుస్తులు దొరక్కపోవడంతో కొనుగోలు చేయలేదు. దీనితో డబ్బులు తన ఖాతాలో జమ చేయాలని కేరళలోని బంధువు సూచించారు. ఈ మేరకు రిన్షాద్‌ శనివారం ఉదయం 6:30 గంటలకు స్నేహితుడు అమీర్‌ స్కూటీపై కోఠిలోని స్టేట్‌బ్యాంకు సీడీఎంలో నగదు జమ చేయడానికి వచ్చారు. ఆయన వెనకాలే ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు సీడీఎం సెంటర్‌లోకి ప్రవేశించారు.


నగదు ఉన్న బ్యాగును లాక్కుని పారిపోవడానికి యత్నించారు. రిన్షాద్‌ ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. అందులో ఒక బుల్లెట్‌ బాఽధితుని కుడికాలుకు తగిలి కిందపడిపోయారు. వెంటనే దుండగులు బాధితుడి వద్ద ఉన్న స్కూటీ తాళాలు లాక్కుని.. ఆ స్కూటీపై కాచిగూడ రైల్వేస్టేషన్‌ వైపు వెళ్లారు. అక్కడ స్కూటీని వదిలేసి.. డీమార్ట్ట్‌ సమీపంలో దుస్తులు మార్చుకున్నారు. తర్వాత ఆటోలో సికింద్రాబాద్‌ వైపు పారిపోయినట్టు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు తెలిసింది. గాయపడ్డ రిన్షాద్‌ వెంటనే డయల్‌-100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్‌ కాలి కండరం నుంచి బయటికి దూసుకెళ్లిందని, బాధితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్‌, రక్తనమూనా లు, ఆధారాలను క్లూస్‌టీమ్‌ సేకరించింది. దుండగులు ఉపయోగించింది దేశవాళీ తుపాకీగా నిర్ధారించినట్లు తెలిసింది.

Updated Date - Feb 01 , 2026 | 06:35 AM