ఇంట్లోనే ఉంటున్నారా?
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:44 AM
ప్రభుత్వం పేదల కోసం నిర్మించి కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో లబ్ధిదారులు వాస్తవంగా నివాసం ఉంటున్నారా? లేక ఇళ్లను ఖాళీగా ఉంచుతున్నారా? అనే అంశంపై పెద్దపల్లి మున్సిపల్, గృహ నిర్మాణ శాఖ అధికారులు దృష్టి సారించారు. లబ్ధిదారుల ఇళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ నివాసం ఉండని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇల్లు ఎందుకు ఖాళీగా
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రభుత్వం పేదల కోసం నిర్మించి కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో లబ్ధిదారులు వాస్తవంగా నివాసం ఉంటున్నారా? లేక ఇళ్లను ఖాళీగా ఉంచుతున్నారా? అనే అంశంపై పెద్దపల్లి మున్సిపల్, గృహ నిర్మాణ శాఖ అధికారులు దృష్టి సారించారు. లబ్ధిదారుల ఇళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ నివాసం ఉండని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇల్లు ఎందుకు ఖాళీగా ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని, లబ్ధిదారుడి పేరిట కేటాయించిన ఇంటిని ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో కారణాలు తెలపాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. మూడుసార్లు నోటీసులు జారీ అయితే ఇల్లు రద్దు అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాంపెల్లిలో 256 డబుల్ బెడ్ రూముల ఇళ్లు, చందపల్లిలో 198 ఇళ్లు, మొత్తం 454 ఇళ్లు నిర్మించారు. ఈ ఇళ్లలో అప్పటి ప్రభుత్వం 2015-16లో చేపట్టినప్పటికీ, అసంపూర్తిగానే నిర్మాణాలు ఆగాయి. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిచిన డబుల్ బెడ్ రూంల ఇళ్లను పూర్తి చేయడంతో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు రాంపెల్లి, చందపల్లిలో గల డబుల్ బెడ్ రూముల ఇళ్ల సముదాయాల వద్ద సుమారు 6 కోట్ల రూపాయలతో మిగులు పనులు చేయడంతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలను పూర్తి చేశారు. గత ఏడాది పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను కూడా పంపిణీ చేశారు. ఏడాది తర్వాత ఎవరెవరు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు నిఘా పెట్టారు.
ఫ ఆరా తీస్తున్న అధికారులు
డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, నివాసం ఉంటున్న కుటుంబాలు, ఇతరులు వినియోగిస్తున్న ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నారు. అవసరమైతే స్థానికుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా, ఖాళీగా ఉండకుండా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఇళ్లను పరిశీలించి ఇల్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేసి.. ఇంట్లో ఎందుకు నివాసం ఉండటం లేదో వివరణ ఇవ్వాలని సూచిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఉపాధి, ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం వంటి కారణాలు ఉంటే వాటిని తెలియజేయాలని పేర్కొంటున్నారు. లబ్ధిదారుల నుంచి వచ్చే వివరణలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత నెల రోజుల్లో కొందరు లబ్ధిదారులకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
ఫ మూడోసారి నోటీసు వస్తే ఇల్లు రద్దు
రెండుసార్లు నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్లు ఇచ్చే వివరణ బట్టి నివాసం ఉంటున్నారా, లేదా అని మూడోసారి వెళ్లి పరిశీలించినప్పుడు అందులో నివాసం ఉండకుంటే మూడోసారి నోటీసు జారీ చేస్తారు. సరైన వివరణ లేకపోతే ఇంటి కేటాయింపు రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇళ్లపై అధికారులు నిఘా పెట్టడంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తాము ఇంట్లో లేని సమయంలో కూలీ పనులకు, ఇతరత్రా విధులకు వెళ్లినప్పుడు వచ్చి ఇంట్లో ఎవరు ఉండడం లేదంటూ నోటీసులు ఇస్తున్నారని ఇటీవల కొందరు లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కల్పించిన గృహ వసతిని లబ్ధిదారులు స్వయంగా వినియోగించుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుక రావాలని అధికారులు సూచిస్తున్నారు.