బిల్లు తగ్గించమంటే ఐడీ అడుగుతావా?
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:23 AM
ఓ ఫుడ్‌కోర్టు నిర్వాహకుడిని ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు తుపాకీతో బెదిరించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
గచ్చిబౌలిలో ఫుడ్‌కోర్టు నిర్వాహకుడిని తుపాకీతో బెదిరించిన ఏఆర్ కానిస్టేబుల్
డయల్100కు ఫిర్యాదు చేసిన స్థానికులు
అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తుపాకీ సరెండర్ చేయకపోవడంపై ఆరా
రాయదుర్గం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఓ ఫుడ్‌కోర్టు నిర్వాహకుడిని ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు తుపాకీతో బెదిరించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వివేక్.. మంగళవారం అర్ధరాత్రి 3గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ వద్ద ఉన్న మోమోస్ డిలైట్ ఫుడ్‌కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆహారం పార్సిల్ తీసుకున్నారు. బిల్లు చెల్లించే సమయంలో తాను పోలీస్ కానిస్టేబుల్‌ను అని, డిస్కౌంట్ ఇవ్వాలని సదరు ఫుడ్‌కోర్టు యాజమానిని అడిగారు. ఐడీ కార్డు చూపాలని సదరు యజమాని కోరడంతో.. వివేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్నే ఐడీ కార్డు అడుగుతావా’ అంటూ తుపాకీని తీసి గురిపెట్టారు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్క సారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు డయల్- 100కు సమాచారం ఇవ్వడంతో గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో లేకున్నా అతడి వద్ద తుపాకీ ఎందుకు ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధులు ముగించుకున్న తర్వాత తుపాకీ సరెండర్ చేయకుండా వివేక్ బయటకు ఎలా వెళ్లారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా, గతంలోనూ వివేక్.. ఇదే విధంగా ప్రవర్తించినట్లు తెలిసింది.