హైదరాబాద్‌లో ‘హాస్పిటల్ ఆఫ్ ద ఫ్యూచర్‘
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:56 AM
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా ‘హాస్పిటల్ ఆఫ్ ద ఫ్యూచర్‘ను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి ప్రకటించారు.
నిరంతర వైద్య సేవలే లక్ష్యం: అపోలో జేఎండీ సంగీతారెడ్డి
హైదరాబాద్ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా ‘హాస్పిటల్ ఆఫ్ ద ఫ్యూచర్‘ను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి ప్రకటించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), అత్యాధునిక సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 365 రోజులు 24 గంటల పాటు వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (ఐహెచ్‌డీ)-2026 వేదికలో సంగీతారెడ్డి ప్రసంగించారు. ప్రస్తుతం ఏఐ ఆధారిత క్లినీషియన్లు, రిమోట్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా అపోలో ఇప్పటికే 4 కోట్ల మంది వినియోగదారులకు చేరువైందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వర్చువల్ వేదిక ద్వారా ప్రసంగిస్తూ, వైద్యం ఎప్పుడూ నిరంతరాయంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, మంత్రులు, ప్రతినిధులు పాల్గొని రోగి భద్రత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాలపై చర్చించారు.