Share News

గ్రామాల్లో వైద్య సేవల్లో ఏపీకి ఎనిమిదో స్థానం

ABN , Publish Date - Aug 24 , 2026 | 04:33 AM

గ్రామాల్లో వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో గ్రామీణ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) పనితీరు, వైద్య సిబ్బంది సేవలపై నిర్వహించిన..

గ్రామాల్లో వైద్య సేవల్లో ఏపీకి ఎనిమిదో స్థానం

  • దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలపై కేంద్రం అధ్యయనం

  • ‘గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచీ’ విడుదల

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో గ్రామీణ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) పనితీరు, వైద్య సిబ్బంది సేవలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో ఏపీ 0.23 స్కోరు సాధించింది. కాగా, పొరుగు రాష్ట్రం తెలంగాణ జీరో స్కోరుతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ‘హెల్త్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియా- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ (2022-23)’ గణాంకాల ఆధారంగా, ‘ప్రిన్సిపల్‌ కాంపోనెంట్‌ అనాలిసిస్‌’ పద్ధతిలో రూపొందించిన ‘గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచీ’ (రూరల్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండెక్స్‌- హెచ్‌ఐఐ)లో రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ 1.00 స్కోరుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా... కేరళ (0.48), మేఘాలయ (0.34), మిజోరం (0.30), రాజస్థాన్‌ (0.29), తమిళనాడు (0.28), ఛత్తీస్‌గఢ్‌ (0.25), ఆంధ్రప్రదేశ్‌ (0.23) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వివిధ అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. ఒక లక్ష జనాభాకు ఎన్ని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి? ఎంతమంది ఫార్మసిస్టులు, రేడియాలజిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉన్నారు..? ప్రతీ వేయి మంది జనాభాకు ఉన్న వైద్యులు, నర్సు లు ఎంతమంది..? వంటి అంశా లను పరిగణ నలోకి తీసుకున్నారు. తెలంగాణ సున్నా స్కోరు నమోదు చేయడానికి తీవ్రమైన మౌలిక వసతుల కొరత ప్రధాన కారణం కాగా, రాష్ట్ర విభజన అనం తర వ్యవస్థాగత మార్పులు కూడా దీనికి పాక్షిక కారణం కావొచ్చని హెచ్‌ఐఐ సూచీ పేర్కొంది.


సంపన్న రాష్ట్రాలూ వెనుకంజలోనే..

ఆర్థికంగా అభివృద్ధి చెందిన పలు రాష్ట్రాల్లోనూ గ్రామీణ ఆరోగ్య మౌలిక వసతులు ఏమంత మెరుగ్గా లేవని హెచ్‌ఐఐ సూచీ వెల్లడించింది. గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, హరియాణా వంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు కూడా సూచీలో దిగువనే ఉన్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడం కంటే.. మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రత్యేక విధానాలు, బడ్జెట్‌ కేటాయింపులు అవసరమని సిఫారసు చేసింది.

Updated Date - Aug 24 , 2026 | 05:00 AM