లెక్కల్లో తప్పులు..తగ్గిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:57 AM
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 23లో పేర్కొన్న లెక్కల్లో తప్పు దొర్లడం వల్ల గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు తగ్గి, అవి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాకు..
ఏపీ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 23లో పేర్కొన్న లెక్కల్లో తప్పు దొర్లడం వల్ల గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు తగ్గి, అవి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాకు అవి బదిలీ అయ్యాయని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ అహ్మద్ నగర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ హుస్సైనీ దీనిని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శాసన మండలిలో స్థానిక సంస్థలకు 13, ఎమ్మెల్యేల కోటాకు 13 సీట్లు ఉండాల్సి ఉండగా 14 చొప్పున కేటాయించారని తెలిపారు. అందువల్ల రెండు గవర్నర్ కోటా సీట్లు తగ్గాయని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.