Sankranti Festival Visit: కోడి పందేల కోసం ఏపీ బాటపడుతున్న యువత..
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:41 AM
హైదరాబాద్‌లోని ఏపీ వాసులు సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లిరావడం ఎప్పుడూ జరిగేదే.
తెలంగాణతోపాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా..
అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళుతున్న వైనం
అత్యధికుల గమ్యస్థానం కృష్ణా, గోదావరి జిల్లాలే
హైదరాబాద్ సిటీ, జనవరి11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఏపీ వాసులు సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లిరావడం ఎప్పుడూ జరిగేదే. వారి వెంట కొందరు తెలంగాణ వాసులు వెళ్లిరావడం ఎప్పుడూ చూసేదే. అయితే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు, గుండాటలు, ఇతర వేడుకలను వీక్షించేందుకు ఇటీవల కాలంలో చాలా మంది.. ముఖ్యంగా యువత చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పండగ సందడి మొదలవ్వగానే ఆయా ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. స్నేహితులు, బంధువుల ఆహ్వానంతో ఏపీకి వెళుతున్నవారు కొందరైతే.. స్నేహితులు పిలవకపోయినా పండగకి మేమూ మీ ఊరికి వస్తాం బా..!! అంటూ స్నేహితుల వెంటపడి బయలుదేరుతున్నారు కూడా ఉంటున్నారు. సంక్రాంతికి ఏపీకి వెళుతున్న వారిలో తెలంగాణ వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానో, స్నేహితులతో చర్చల్లోనూ పండగ సందర్భంగా ఏపీలో జరిగే సందడిని తెలుసుకొని ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా సంక్రాంతికి ఏపీ బాటపడుతున్నారు. ఐటీ ఉద్యోగ వర్గాల్లో ఈ ట్రెండ్ అధికంగా ఉంది. వీకెండ్ టూర్లు, లాంగ్ డ్రైవ్‌లకు అలవాటు పడిన ఐటీ రంగంలోని కుర్రకారు సంక్రాంతికి కోడిపందేలు, గుండాటాల కోసం ఎగబడుతున్నారు. హైబ్రీడ్ పద్ధతిలో పని చేసుకునే అవకాశం ఉండడంతో వీలైనన్నీ రోజులు అక్కడే ఉండేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఇలా వెళుతున్న వారిలో అత్యధికుల గమ్యస్థానం కృష్ణా, గోదావరి జిల్లాల్లోని గ్రామాలే కాగా.. స్నేహితులు, బంధువులు లేకపోయిన కొందరు కోడి పందేలు జరిగే గ్రామాల్లో ఈవెంట్ నిర్వాహకుల వద్ద ప్యాకేజీలు బుక్ చేసుకుని వెళుతున్నారు.
మళ్లీ ఎప్పుడు వెళదాం.. ?
ఉద్యోగ రిత్యా 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడిపోయిన ఏపీకి చెందిన బద్రినాథ్ గత సంక్రాంతికి స్వస్థలానికి వెళ్లేటప్పుడు తమ వెంట ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లారు. అప్పుడు తనతో వచ్చిన స్నేహితులు.. మళ్లీ ఎప్పుడు వెళదాం ? అంటూ ఇప్పుడు తన వెంట పడుతున్నారని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక, తనతోపాటు తెలంగాణ, యూపీ వ్యక్తులు తమ ఊరికి వస్తున్నారని రాజోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నరహరి పేర్కొన్నారు. కోడిపందేలు, గుండాటల కోసం తన స్నేహితులు రెండు నెలల జీతాలు తీసుకువస్తున్నారని తెలిపారు. కోడి పందేల కోసం చెబుతుంటే విని ఆసక్తి కలిగిందని, అందుకే నరహరి పిలవగానే సరే అన్నానని నరహరి స్నేహితుడు యూపీకి చెందిన చౌదరి చెప్పారు. దసరాకు తాను దావత్‌కు తీసుకువెళ్లానని, ఇప్పుడు సంక్రాంతికి వాడు నన్ను తీసుకెళుతున్నాడని నరహరి స్నేహితుడు కరీంనగర్‌కు చెందిన అఖిల్ తెలిపాడు. వీళ్లే కాదు చాలా మంది స్నేహితులు ఇలానే కోడి పందేల కోసం ఆంధ్రాకు చేరుతున్నారు.