Trumpet Style Flyover: ఔటర్‌పై మరో ట్రంపెట్ ఫ్లై ఓవర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:09 AM
ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ట్రంపెట్ డిజైన్‌లో (‘బాకా’ తరహా) ఫ్లైఓవర్ రానుంది. ఇప్పటికే నియోపోలిస్ లేఔట్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ...
బుద్వేల్ లేఔట్ నుంచి ఔటర్ రింగు రోడ్డుకుఅనుసంధానంగా ‘బాకా’ మాదిరి డిజైన్
రూ.488 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ట్రంపెట్ డిజైన్‌లో (‘బాకా’ తరహా) ఫ్లైఓవర్ రానుంది. ఇప్పటికే నియోపోలిస్ లేఔట్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ట్రంపెట్ ఫ్లైఓవర్‌తో శంకర్‌పల్లి నుంచి నగరానికి రాకపోకలు సాగించడం సులువు గా మారిన సంగతి తెలిసిందే. బుద్వేల్ లేఔట్‌తో పాటు సరికొత్తగా వచ్చే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు-2కు, రాజేంద్రనగర్ ఇంటర్‌చేంజ్‌కు అనుసంధానంగా నిర్మించనున్న ఈ సరికొత్త ట్రంపెట్ ఫ్లై ఓవర్ బహుళప్రయోజక ఇంటర్‌చేంజ్‌గా నిలువనుంది. కోత్వాల్‌గూడలో రూ.వంద కోట్లతో అభివృద్ధి చేసిన ఏకో పార్కును, దేశంలోనే అతిపెద్ద పక్షిశాలను సందర్శించడానికి అనువుగా మారనుంది. ఈ ట్రంపెట్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.488కోట్ల అంచనా వ్యయంతో హెచ్‌ఎండీఏ అధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రేపో, మాపో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాలన అనుమతులు రానున్నాయి. బుద్వేల్ లేఔట్ వద్ద ట్రంపెట్ ఫ్లై ఓవర్ నిర్మాణం నిమిత్తం ఇప్పటికే ఓ కన్సల్టెన్సీ ద్వారా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన చేశారు. దీని నిర్మాణం వల్ల.. కోత్వాల్‌గూడ ఎకో పార్కులో కొంత మేరకు ప్రభావితం కానుంది. అలాగే, పరిసర ప్రాంతాల్లో దాదాపు 24 ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉన్నది. అయుతే అదంతా ప్రభుత్వ స్థలమే కావడంతో ప్రభుత్వం అనుమతిస్తే ప్రాజెక్టు నిర్మాణం పరుగులు తీయనుంది.