పురపోరులో మరో అడుగు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:12 AM
పురపోరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్సాహం మొదలైంది. ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించాయి.
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
వార్డుల వారీగా విడుదల చేసిన మునిసిపల్ కమిషనర్లు
ఏర్పాట్లలో అధికారులు... ఆశావహుల్లో ఉత్సాహం
రిజర్వేషన్లపై ఆరా తీస్తున్న నేతలు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పురపోరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్సాహం మొదలైంది. ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించాయి. నేతలు ఆశించిన విధంగానే పురపాలి క ఎన్నికల్లో మరో ముందడుగు పడింది. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఓటర్ల ముసాయిదా జాబితాను మునిసిపల్ కమిషనర్లు విడుదల చేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఆరు మునిసిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను మునిసిపల్ కమిషనర్లు ప్రకటించారు. ఈనెల 5వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించి జాబితాలో మా ర్పులు,చేర్పులు చేస్తారు. అనంతరం అదే రోజు రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 7న జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారీగా తుది జాబితాను ఆమోదం కోసం కలెక్టర్లకు సమర్పిస్తారు. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. జిల్లాలోని భువనగిరి మునిసిపాలిటీలో మొత్తం 35 వార్డులు, 47,840 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఆలేరు మునిసిపాలిటీలో 12 వార్డులు, మొత్తం 13,670 మంది ఓటర్లు, భూదాన్‌పోచంపల్లిలో 13 వార్డులు, మొత్తం 15,839 మంది ఓటర్లు, చౌటుప్పల్‌లో 20 వార్డులు, 27,216 మంది ఓటర్లు, మోత్కురులో 12 వార్డులు, 14,416 మంది ఓటర్లు, యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో 12 వార్డులు, 13,821 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులోకి మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు తుది రూపు తీసుకొచ్చే ప్రక్రియ నిర్వహించారు. అనంతరం అధికారికంగా వార్డుల్లో ఓటర్ల జాబితాలను అతికించారు. అభ్యంతరాలు స్వీకరించి మార్పులు, చేర్పులు చేస్తారు. అయితే మృతి చెందినవారి ఓట్లు స్థానికేతరులవి తొలగించరు. అదేవిధంగా కొత్త ఓటర్లను కూడా నమోదు చేయరు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నిబంధనల మేరకు జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను రూపొందించింది.
ఏర్పాట్లలో అధికారులు...
మునిసిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితాల రూపకల్పనను అధికారులు ముమ్మరం చేయగా రాజకీయ పార్టీల నేతలు మునిసిపల్ కార్యాలయాల బాటపట్టారు. జిల్లా యంత్రాంగం మునిసిపాలిటీల్లో వార్డు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పన నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని వార్డు అధికారులను జిల్లా అధికారులు ఆదేశించారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల్లోని పోలింగ్ కేంద్రాలను కమిషనర్లు, సిబ్బంది పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో స్టేషన్లు, స్థితిగతులు, గతంలో పోలింగ్ నిర్వహించిన కేంద్రాల్లో వసతులపై ఆరా తీస్తున్నారు. మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, కిటికీలు ఇతర సౌకర్యాలు పరిశీలిస్తున్నారు. మరోవైపు మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో ఎన్నికల బరిలో నిలిచే ఆశావహుల్లో ఉత్సాహం మొదలైంది.
రిజర్వేషన్లపై ఆరా
మునిసిపాలిటీల్లో గత ప్రభుత్వం 10 ఏళ్లపాటు ఒకే రిజర్వేషన్‌ను కేటాయించింది. అయితే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ఈ రిజర్వేషన్లలో మార్పులు తీసుకురానుంది. రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయపార్టీల నేతలు ఓటరు జాబితాల మార్పులు, వార్డుల రిజర్వేషన్లపై ఆరా తీస్తున్నారు. మునిసిపాలిటీల్లో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు ఏ రిజర్వేషన్ వస్తుందోనని లెక్కల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పట్టణాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల చర్చలే జరుగుతున్నాయి. గతంలో ఉన్న రిజర్వేషన్ మళ్లీ వస్తుందా? లేదా అనే అంశంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. వార్డుల్లో పోటీచేసే ఆశావహులు మాత్రం ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతున్నారు.