ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం
ABN , Publish Date - May 08 , 2026 | 01:14 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ఫీజులో మరోసారి ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం ఫీజు చెల్లింపులో 25
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ఫీజులో మరోసారి ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం ఫీజు చెల్లింపులో 25 శాతం రైతు ప్రకటిస్తూ జీవో 131 జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యతరగతి ప్లాట్ యజమానులకు భారీ ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. జూలై 31వరకు రాయితీ గడువును వినియోగించుకొని ఫీజు చెల్లించి ప్రభుత్వం కల్పించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు గ్రామపంచాయతీల పరిధిలో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఆరేళ్లుగా కసరత్తు చేస్తూనే ఉంది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 రాయితీ ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత మరో నెలరోజులపాటు పొడిగించారు. జిల్లాలో కొంతమంది దరఖాస్తులు ముందుకు వచ్చినా చిన్నచిన్న లోపాలతో దరఖాస్తులు పెండింగ్‌లో చూపడంతో నిరాశపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి 25 రాయితీతో అవకాశం కల్పించడం ద్వారా షార్ట్‌ఫాల్‌ను సరిచేసుకొని క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. గత సంవత్సరం రాయితీ సమయంలో జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా దాదాపు రూ 40 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా రూ 20.68 కోట్ల వరకు మాత్రమే ఆదాయం లభించింది. ఈసారి ఇచ్చిన గడువు ద్వారా మరో రూ 50 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
ఆరేళ్లుగా కొనసాగుతున్న ఎల్‌ఆర్‌ఎస్
అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌లో 25 శాతం రాయితీ నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం భావించినా అనుకున్న దరఖాస్తుదారులు నామమాత్రంగానే ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా 42,942 దరఖాస్తులు రాగా, 4796 దరఖాస్తులు తిరస్కరించారు. గతంలో 27 వేల మంది దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించి తమ ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సమాచారం అందించారు. ఇందులో 16 వేల దరాఖాస్తులు క్లీయర్‌గా ఉన్న వాటిలో 8 వేల మంది దరఖాస్తుల ఫీజులు చెల్లించారు. దీనిద్వారా రూ 20.68 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 25శాతం రాయితీ ప్రకటించినా దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో భూముల ధరలు ఆశాజనకంగా లేకపోవడం, అమ్మకాలు లేకపోవడం, భూసంబంధ వివాదాలు, కేసులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడం వంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. ఈక్రమంలోనే అవగాహన కార్యక్రమాల ద్వారా దరఖాస్తుదారులను ప్రొత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినా యూజర్ మాన్యువల్ ఫీ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు, సర్వర్‌లు బిజీగా ఉండడం, ఆన్‌లైన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడం, దరఖాస్తుదారులకు నేరుగా ఆటోజనరేట్ మేసేజ్‌లు వెళ్లకపోవడం, సర్వర్‌లు మోరాయించడం వంటి ఇబ్బందులను దరఖాస్తుదారులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా దృష్టి పెట్టారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామపంచాయతీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ కోసం 42,942 దరఖాస్తులు వచ్చాయి. 2020 సెప్టెంబరులో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రజలపై మోయలేని భారం మోపిందనే అభిప్రాయంతో ఎవరూ దరఖాస్తులు చేసుకున్నా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలు గ్రామపంచాయతీల్లో అక్రమ లే అవుట్‌లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు సెప్టెంబరు 1,2020న బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 26 ఆగస్టు 2020లోపు సేల్‌డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసిన లేఅవుట్‌ల యజమానులు, ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఇంటి పన్నులు చెల్లించి క్రయవిక్రయాలు జరిపిన వారు కూడా ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించే పరిస్థితి నెలకొంది. లేనిపక్షంలో క్రయవిక్రయాలు జరిపే అవకాశం లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రకటనలు చేసి సర్వేలు చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. గత సంవత్సరం జూలై నెలలో మున్సిపాలిటీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించి పరిష్కరించే దిశగా దిశానిర్ధేశం చేసినా ఆశించిన మేరకు స్పందన రాలేదు. ఇతర సర్వేలతో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని తెలుస్తోంది.
జిల్లాలో 42,942 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ఇలా...
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామ పంచాయతీల పరిఽధిలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు 42,942 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,493 దరఖాస్తులు, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 16,336 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా 16,113 దరఖాస్తులు వచ్చాయి. గామపంచాయతీల్లో వచ్చిన దరఖాస్తుల్లో బోయినపల్లి మండలంలో 645 దరఖాస్తులు, చందుర్తిలో మండలంలో 213 దరఖాస్తులు, ఇల్లంతకుంటలో మండలంలో 1054 దరఖాస్తులు, గంభీరావుపేటలో మండలంలో 861 దరఖాస్తులు, కోనరావుపేటలో మండలంలో 277 దరఖాస్తులు, వేములవాడ అర్బన్ మండలంలో 3702 దరఖాస్తులు, ముస్తాబాద్ మండలంలో 1074 దరఖాస్తులు, ఎల్లారెడ్డిపేట మండలంలో 3949 దరఖాస్తులు, తంగళ్లపల్లిలో మండలంలో 3784 దరఖాస్తులు, వేములవాడ రూరల్ మండలంలో 214 దరఖాస్తులు, రుద్రంగి మండలంలో 304 దరఖాస్తులు, వీర్నపల్లిలో మండలంలో 71 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ప్రభుత్వం జూలై 31లోపు దరఖాస్తుచేస్తే 25 శాతం రాయితీపై గడువు పొడగించింది. లే అవుట్‌లలో కేవం పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి, మిగిలినవి రిజిస్ట్రేషన్ కాకపోతే 90 శాతం ప్లాట్లు క్రమబద్ధీకరణకు అనుమతిస్తున్నారు. చాలా మంది రియల్టర్లు అనుమతి లే అవుట్ ప్లాట్లు కొన్నవారు రూ.10 వేల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత రూ 1000 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం రాయితీతోనైనా ఎల్‌ఆర్‌ఎస్ ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఒక్కో ప్లాట్‌కు గత మార్కెట్ ధరలకు అనుగుణంగా కనీసం రూ 20 నుంచి రూ 50 వేల వరకు ఆదాయం లభిస్తుంది.