నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:31 AM
పచ్చని అడవులు, చక్కని వన్యప్రాణులు, సుందర జలాపాతం మధ్య కొలువైన పరమేశ్వరుడిని తోటి భక్తుల జయజయధ్వానాల మధ్య దర్శించుకోవాలనుకుంటున్నారా...
అచ్చంపేట/మన్ననూర్ (ఆంధ్రజ్యోతి): పచ్చని అడవులు, చక్కని వన్యప్రాణులు, సుందర జలాపాతం మధ్య కొలువైన పరమేశ్వరుడిని తోటి భక్తుల జయజయధ్వానాల మధ్య దర్శించుకోవాలనుకుంటున్నారా? నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల పులుల అభయారణ్య ప్రాంతంలోని సలేశ్వరంలో వెలసిన శివయ్యను దర్శించుకోండి. అక్కడ లింగమయ్య ప్రత్యేక ఉత్సవాలు బుధవారం మొదలవుతాయి. ఆ రోజు ఉదయం 7గంటల నుంచి మూడో తేదీ సాయంత్రం 5 గంటల వరకు అంటే మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మూడు లక్షల మంది భక్తులు పార్వతీపతిని దర్శించుకోనున్నారు. ఉత్సవాల కోసం అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతులిచ్చింది. ఉత్సవాలు ముగిశాక ప్లాస్టిక్ వ్యర్థాలను శుద్ధిచేసి, వన్యప్రాణులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా తిరిగి అటవీ ప్రాంతాన్ని శుభ్రం చేసేలా షరతు విధించింది. భక్తుల కోసం అన్నదానం, తాగునీరు, అంబలి కేంద్రాలు పెట్టేవారికి.. శీతలపానీయాలు, చిరుతిళ్ల వ్యాపారులకు ప్రత్యేక అనుమతులిచ్చారు. సలేశ్వరం క్షేత్రానికి రెండు మార్గాల్లో భక్తులు తరలివస్తారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు మీదుగా పర్హాబాద్ చౌరస్తా నుంచి పుల్లాయపల్లి, రాంపూర్ పెంటల వరకు చేరుకొని అక్కడి నుంచి 3 కి.మీ మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళితే లోయలో కొలువుదీరిన లింగమయ్యను దర్శించుకోవొచ్చు. మరో మార్గం.. లింగాల మండలం గిరిజా గుండాల వరకు వాహనాల్లో చేరుకొని అక్కడి నుంచి 6 కి.మీ కాలినడక ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు.