కాంక్రీట్ వల్ల కాదు డిజైన్లలో లోపం వల్లే..
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:00 AM
కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కాంక్రీట్ పటుత్వంలో లోపం కారణం కాదు.. డిజైన్ లోపాలే కారణం.. ఇంకెంతకాలం ఇలాగే ఉంటారు..
ఇప్పటికైనా డిజైన్ ఎలా చెయ్యాలో నేర్చుకోండి.. ఇంకెంత కాలం డ్రిల్లింగ్ చేస్తారు ?
సమస్య ఉన్న చోటే రంధ్రం చెయ్యండి
ఐఐటీ రూర్కీ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకోండి
నీటిపారుదల శాఖ అధికారులకు ఎన్‌డీఎస్ఏ ఛైర్మన్ అనిల్‌జైన్ క్లాస్
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కాంక్రీట్ పటుత్వంలో లోపం కారణం కాదు.. డిజైన్ లోపాలే కారణం.. ఇంకెంతకాలం ఇలాగే ఉంటారు.. ఇప్పటికైనా లోపాల్లేకుండా డిజైన్లు ఎలా చేయాలో నేర్చుకోండి... అంటూ నీటిపారుదలశాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) యంత్రాంగానికి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ క్లాస్ తీసుకున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై అనిల్ జైన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నీటిపారుదలశాఖ క్షేత్రస్థాయి యంత్రాంగంతో పాటు సీఈ సీడీవో, కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎస్), ఆఫ్రీ ఇండియా(ముంబై-బ్యారేజీల పునరుద్ధరణ డి జైన్లు బాధ్యత దక్కించుకున్న సంస్థ) ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ జైన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేసే ప్రక్రియ ప్రారంభమైందా ? లేదా ? అని ఆరా తీశారు. నమూనా అధ్యయనాలు రాలేదని, పరీక్షల ఫలితాలు రాలేదని సీఈ సీడీవో బదులివ్వగా.. ఇంకెన్ని నమూనా అధ్యయనాలు కావాలని అనిల్ జైన్ ప్రశ్నించారు. ఐఐటీ-రూర్కీ చేసిన నమూనా అధ్యయనాలతో ముందుకెళ్లొచ్చు కదా ? అని అడిగారు. అనంతరం భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయా? అని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధికారులను ప్రశ్నించారు. బ్యారేజీలో ప్రతి వరుసలో మూడు బోర్ హోల్స్(రంధ్రాలు) వేసి వివరాలు తీసుకుంటున్నామని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ బదులివ్వగా అభ్యంతరం వ్యక్తం చేశారు. లోపం ఎక్కడుందో అక్కడ రంధ్రం చేస్తే సరిపోతుందని, బ్యారేజీలన్నింట్లో ఎన్ని రంధ్రాలు వేస్తారని నిలదీశారు. మేడిగడ్డలో ఏడో బ్లాకులో కుంగినందునా... ఆ బ్లాకుతో పాటు బ్యారేజీకి ఎన్ని బ్లాకులు ఉంటే.. ఆయా బ్లాకుల్లో ఒక్క రంధ్రం చేస్తే సరిపోతుందని సూచించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఉన్న బ్లాకుల్లోనే రంధ్రాలు వేసి పరీక్షలు చేయాలని, మిగిలిన బ్లాకులు, స్తంభాల కింద రంధ్రాలు చేయవద్దని స్పష్టం చేశారు. ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారమే రంధ్రాలు వేసి పరీక్షలు చేస్తున్నామని అధికారులు చెప్పగా అనిల్ జైన్ అంగీకరించలేదు. లోపాలు ఉన్న ప్రాంతానికే పరిమితం కావాలని నిర్దేశించారు. ఒక్కో బ్యారేజీకి 70-100 రంధ్రాలు చేయడం ఎందుకని, ఇంకెంత కాలం డ్రిల్లింగ్ చేస్తారని? మండిపడ్డారు. నమూనా అధ్యయనాల కోసం ఐఐటీ రూర్కీతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు. కాంక్రీట్ పటుత్వం సరిగ్గా ఉందా? లేదా? అని పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని సీఈ సీడీవో బదులివ్వగా.. కాంక్రీట్ పటుత్వంలో లోపాల వల్ల కాదు.. డి జైన్‌లలో లోపాలే బ్యారేజీల వైఫల్యానికి కారణమని అనిల్ జైన్ అన్నారు.
నిరర్థకంగా బ్యారేజీలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను 2019 మేలో ప్రారంభించారు. వరదల అనంతరం నవంబరులో గేట్లు మూసివేయగా బ్యారేజీల దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి, మే నెలల్లో కూడా రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. ఈ లోపాలను సరిచేయకుండానే బ్యారేజీలు పూర్తయినట్లు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చేయగా లోపాలు క్రమంగా పెరిగిపోయాయి. దీంతో 2023 అక్టోబరు 21నమేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు 1.256 మీటర్ల మేర కుంగింది. మేడిగడ్డ తీవ్రంగా దెబ్బతిందని, అన్నారంలోనూ తీవ్రవ అధికంగానే ఉందని, సుందిళ్లలో సీపేజీలకు గ్రౌటింగ్ చేస్తే సరిపోతుందని ఆ తర్వాత అధికారులు గుర్తించారు. 2022 జూలైలో వరదలకు కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం(అన్నారం) పంప్‌హౌ్‌సలు నీట మునగ్గా, కన్నెపల్లి తీవ్రంగా దెబ్బతింది. దాంతో నాలుగేళ్లుగా పంపులు, రెండున్నరేళ్లుగా బ్యారేజీలు నిరర్థకంగా మారాయి. ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలు తరలిస్తూ నీటిని అందిస్తున్నారు.