kumaram bheem asifabad- అంగన్‌వాడీ...ఆధునిక ఒడి
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:24 PM
అంగన్‌వాడీ... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సమకూర్చే కేంద్రం. ప్రస్తుతం ఇది శిశువు మరణాలు తగ్గించడంతో పాటు ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందించే వనరుగా అభివృద్ధి చెందింది. రూపురేఖల్లో రూపాంతరం చెందింది. ఈ క్రమంలో అంగన్‌వాడీ...ఆధునిక ఒడిలో చేరింది.
- అంగన్‌వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు పంపిణీ
- సులభంగా యాప్‌లలో నమోదు
బెజ్జూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సమకూర్చే కేంద్రం. ప్రస్తుతం ఇది శిశువు మరణాలు తగ్గించడంతో పాటు ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందించే వనరుగా అభివృద్ధి చెందింది. రూపురేఖల్లో రూపాంతరం చెందింది. ఈ క్రమంలో అంగన్‌వాడీ...ఆధునిక ఒడిలో చేరింది. సాంకేతికత అందిపుచ్చుకుంది. అంగన్‌వాడీ టీచర్లకు గతంలో అందించిన ఫోన్లకు కాలం చెల్లింది. వాటన్నింటినీ బుట్టదాఖలు చేసి నూతన ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. పంపిణీ చేసిన ఫోన్లలో 5జీ సామర్థ్యం కూడా ఉంది. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కేంద్రాల్లోని పరిదిలో 1006మంది అంగన్‌వాడీ టీచర్లు, 40మంది సూపర్‌వైజర్లు, 5బ్లాక్ కో ఆర్డినేటర్లకు ఇటీవల 5జీ ఫోన్లను అందజేశారు.
- శాఖాపరమైన..
కొత్త మొబైల్ ఫోన్లు చేతికి అందాక వాటిల్లో శాఖాపర యాప్‌లను నమోదు చేస్తారు. వీటిలో ఫోషన్ ట్రాకర్, ఎన్‌ఎస్‌టీఎస్ కీలకం. వీటి ద్వారానే గర్భిణులకు, బాలింతలకు ముఖ గుర్తింపునకు ఫొటో తీయాల్సి ఉంటుంది. పిల్లలకు అందించే పోషకాహారం వివరాలను పొందుపరచాలి. కేంద్రం తెరవడం మొదలు టీచర్, ఆయా, పిల్లలు, గర్భిణులు, బాలింతల ముఖ గుర్తింపు హాజరు, హాట్ కుక్డ్ మీల్ ఫొటో తీయాలి. ప్రతి నెలా విలేజ్ హెల్త్ శానిటేషన్ డే నిర్వహణ, హాజరైన వారి చిత్రం నమోదు తప్పనిసరి. ప్రతి నెలా తీసే పిల్లల ఎత్తు, బరువు క్రమం తప్పకుండా గర్భిణుల బరువు గుర్తించి నమోదు చేయాలి.
- పారదర్శక సేవకు చేయూత..
మొన్నటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు కాగితాలకే పరిమితం కాగా ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. ప్రతీ అంశానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పర్యవేక్షణ ఉంటుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఏ రకమైన పోషకాహారం అవసరమో అధికారులకు కచ్చితంగా తెలుస్తుంది. ఏ విధమైన అక్రమాలకు తావుండదు. కొత్త ఫోన్లతో పారదర్శకత సేవకు చేయూత లభిస్తుంది. పాత ఫోన్లతో టీచర్లు ఎదుర్కొన్న అవస్థలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు విషయాన్ని ప్రభుత్వానికి నివేధించడంతో సానుకూల స్పందన వచ్చింది. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రా లకు నూతన ఫోన్లు అందించడంతో ఇక వారి కష్టాలు దూరమయ్యాయి. టీచర్లు పడుతున్న కష్టాలు గమ నించిన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడంతో ఇబ్బందులు తప్పనున్నాయి.
- స్మార్ట్ లెర్నింగ్‌కు పునాది..
చిన్నారులు ఇప్పటిదాకా పుస్తకాలు, బొమ్మలు, ఆటలాడుకునే వస్తువులతో గడుపుతున్నారు. నూతన ఫోన్లతో అంగన్‌వాడీ టీచర్లు విధి నిర్వహణకే కాకుండా పిల్లల స్మార్ట్ లెర్నింగ్‌కు పునాది పడుతుంది. పిల్లలకు అవసరమైన పాటలు, ఆటలు, కథలు 5జీ సామర్థ్యం కలిగిన కొత్త ఫోన్లలో వీక్షించే వీలు కలుగుతుంది. దీని వల్ల అంగన్‌వాడీ కేంద్రాల వైపునకు చిన్నారులు క్రమం తప్పకుండా అడుగులు వేసే అవకాశం ఉంటుంది.