Anganwadi Breakfast Scheme: వచ్చేనెల నుంచి అంగన్‌వాడీల్లో అల్పాహారం
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:28 AM
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించే పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మేడారం మహా జాతర ముగిశాక పథకం ప్రారంభం
టీజీ ఫుడ్స్ నుంచి సరఫరా చేసిన ఆహారం అందజేత
తొలుత హైదరాబాద్ జిల్లాలో.. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించే పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఇప్పటికే మధ్యాహ్న భోజనం, గుడ్లు, బాలామృతం అందిస్తున్న సర్కారు.. ఇకపై అల్పాహారం కూడా అందించేందుకు సిద్ధమైంది. ఒక్కో రోజు ఒక్కో రుచి అన్నట్లుగా.. ఒక రోజు కిచిడీ, మరో రోజు ఉప్మా.. ఇలా రకరకాలైన మెనూ రూపొందించారు. వాస్తవానికి ఈ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే..ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రతిష్ఠాత్మక మేడారం మహా జాతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున.. అల్పాహార పథకాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా టీజీ ఫుడ్స్ ద్వారా సిద్ధం చేసిన పోషక విలువల ఆహారాన్ని చిన్నారులకు అందించనున్నారు. అల్పాహార పథకాన్ని తొలుత హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ పరిధిలోని 970 అంగన్‌వాడీ కేంద్రాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లోని 15 వేల మంది చిన్నారులకు ప్రతి రోజూ అల్పాహారం రూపంలో పౌష్ఠికాహారం అందిస్తారు. లోటుపాట్లను సరిదిద్ది.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 8లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు. మేడారం జాతర ముగిశాక మంత్రి సీతక్క, ఆ శాఖ అధికారులంతా ఈ పథకంపై దృష్టి సారించనున్నారు.