Share News

ఈసెట్‌ అడ్మిషన్లపై ‘కోఎంప్ట్‌’ ఎఫెక్ట్‌!

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:03 AM

ఒక్క నిర్ణయం పాలిటెక్నిక్‌ ఫలితాలను అస్తవ్యస్తం చేసింది. కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ కంపెనీ నిర్వాకంతో ఇప్పుడు విద్యార్థుల జవాబు పత్రాలన్నింటినీ పునఃమూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈసెట్‌ అడ్మిషన్లపై ‘కోఎంప్ట్‌’ ఎఫెక్ట్‌!

  • పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమాధాన పత్రాలన్నీ పునఃమూల్యాంకనం

  • దాదాపు 7 లక్షల పత్రాలను మాన్యువల్‌గా దిద్దించాలని నిర్ణయం

  • ఫైనలియర్‌ విద్యార్థులవే 75వేలు.. ముందు వీరి ఫలితాలు విడుదల

  • 20 లోగా ప్రక్రియను పూర్తిచేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒక్క నిర్ణయం పాలిటెక్నిక్‌ ఫలితాలను అస్తవ్యస్తం చేసింది. కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ కంపెనీ నిర్వాకంతో ఇప్పుడు విద్యార్థుల జవాబు పత్రాలన్నింటినీ పునఃమూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఈసెట్‌ రాసి లేటరల్‌ ఎంట్రీలో బీటెక్‌లో చేరాల్సిన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయి, ఫలితాలు ఇవ్వాల్సిన సమయంలో తిరిగి మొత్తం ప్రక్రియను మొదటినుంచీ చేపట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో వారు రాసిన సమాధాన పత్రాలు దాదాపు 7 లక్షలు ఉన్నాయి. వాటన్నిటినీ కోఎంప్ట్‌ కంపెనీ ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌ విధానంలో మూల్యాంకనం చేసింది. ఫలితాలు విడుదల చేసే సమయానికి సీబీఎ్‌సఈ రిజల్ట్‌లో గోల్‌మాల్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. అందులో కోఎంప్ట్‌ పాత్ర ఉండటంతో పాలిటెక్నిక్‌ ఫలితాల విడుదలను ఉన్నత విద్యాశాఖ నిలిపివేసింది. మొత్తం సమాధాన పత్రాలను తిరిగి మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్కుల నమోదుకు ఓఎంఆర్‌ షీట్లు ఆర్డర్‌ పెట్టారు. ఒకట్రెండు రోజుల్లో మాన్యువల్‌ మూల్యాంకనం ప్రారంభం కానుంది. దీంతో ఉన్నత విద్యాశాఖపై ఆర్థికంగా అదనపు భారం పడనుంది.

మూల్యాంకనానికి నెల రోజులు

పాలిటెక్నిక్‌ మూడేళ్ల విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనానికి నెల రోజుల సమయం పడుతుంది. దీనివల్ల ఈసెట్‌ ద్వారా బీటెక్‌లో చేరాలనుకునే ఫైనలియర్‌ విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో తొలుత వారి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఫైనలియర్‌ మొత్తం 30వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇండస్ర్టియల్‌ ఇంటర్న్‌షి్‌పను దశల వారీగా చేపడుతున్నందున వీరికి రెండు దశల్లో పరీక్షలు నిర్వహించారు. 15వేల మందికి గత నవంబరులోనే ఫలితాలు ఇచ్చారు. మరో 15 వేల మంది ఇటీవల పరీక్షలు రాశారు. వారి సమాధాన పత్రాలు దాదాపు 75 వేలు ఉన్నాయి. ఈ నెల 20లోగా వాటిని మాన్యువల్‌గా మూల్యాంకనం చేసే ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఆ వెంటనే చివరి సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ప్రకటించి ఈసెట్‌ ద్వారా బీటెక్‌ లేటరల్‌ ఎంట్రీ అడ్మిషన్లు చేపట్టనుంది.

Updated Date - Jun 05 , 2026 | 05:03 AM