Telangana Assembly: 2 బిల్లులకు శాసన సభ ఆమోదం
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:54 AM
రాష్ట్ర శాసన సభ శనివారం రెండు బిల్లులను ఆమోదించింది. ప్రముఖ కవి, గాయకుడు దివంగత అందెశ్రీ (అందె ఎల్లయ్య) కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే సవరణ బిల్లు...
అందెశ్రీ కుమారుడికి ఉద్యోగం
క్రమబద్ధీకరించిన నాటి నుంచే తాత్కాలిక ఉద్యోగుల సర్వీసు పరిగణలోకి...
కవులు, కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు: భట్టి
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసన సభ శనివారం రెండు బిల్లులను ఆమోదించింది. ప్రముఖ కవి, గాయకుడు దివంగత అందెశ్రీ (అందె ఎల్లయ్య) కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే సవరణ బిల్లు, తాత్కాలిక ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించిన నాటి నుంచి లెక్కలోకి తీసుకునే సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘తెలంగాణ (ప్రభుత్వ సేవల నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరును, వేతన స్వరూపాన్ని హేతుబద్ధీకరించడం) సవరణ బిల్లు-2026’, ‘రెండో సవరణ బిల్లు-2026’లను సభలో ప్రవేశపెట్టారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు వీలుగా సవరణ బిల్లు-2026ను సభ ఆమోదించింది. సిద్దిపేట జిల్లాలోని రేబర్తిలో జన్మించిన అందెశ్రీ 3000 కవితలను రచించడమే కాకుండా.... ‘జయ జయహే తెలంగాణ’ అనే రాష్ట్ర గేయాన్ని అందించారని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక పురోగతిలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని, ఆయన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే అందెశ్రీ కుమారుడు దత్త సాయిని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో నియమించామని తెలిపారు. ఈ నియామకం ఆర్డినెన్స్ ద్వారా జరిగిందని వివరించారు. కవులు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తుందని చెప్పారు. ఇక సభలో ఆమోదం పొందిన ‘తెలంగాణ (ప్రభుత్వ సేవల నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరును, వేతన స్వరూపాన్ని హేతుబద్ధీకరించడం) రెండో సవరణ బిల్లు-2026’ ప్రకారం... రాష్ట్రంలో పని చేసే దినసరి వేతనం, కాంట్రాక్టు, క్యాజువల్, పార్ట్-టైమ్, గంటల ప్రాతిపదికన పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించిన నాటి నుంచే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.