Share News

ఆనంద్‌ ప్రభాత్‌ సొసైటీలో ఆ భూమి మాదే

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:14 AM

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2లోని ఆనంద్‌ ప్రభాత్‌ సొసైటీలో 12000 చదరపు గజాల స్థలానికి సంబంధించి సంపూర్ణ అధికారాలు తమకే ఉన్నాయని రిత్విక్‌ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆనంద్‌ ప్రభాత్‌ సొసైటీలో ఆ భూమి మాదే

  • 2001లోనే కొన్నాం.. చట్టబద్ధమైన హక్కు పత్రాలన్నీ ఉన్నాయి

  • 2006లో నకిలీ పత్రాలతో కబ్జాకు వాసిరెడ్డి శివనారాయణ యత్నం

  • దీనిపై 2014లోనే కేసు .. రిత్విక్‌ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ వివరణ

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్ర జ్యోతి): బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2లోని ఆనంద్‌ ప్రభాత్‌ సొసైటీలో 12000 చదరపు గజాల స్థలానికి సంబంధించి సంపూర్ణ అధికారాలు తమకే ఉన్నాయని రిత్విక్‌ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2001లోనే ఈ భూమిని సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపింది. రమేష్‌, రాజేష్‌, శ్రీదేవి, సీఆర్‌ ప్రకృతి, రిత్విక్‌ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్ల మీద చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే వాసిరెడ్డి శివనారాయణ, నాగకుమారి, మయూర్‌, తారక్‌ రామ్‌, శంకర్‌ అనే వ్యక్తులు 2006లో నకిలీ పత్రాలు, తప్పుడు సర్టిఫికెట్లు పుట్టించి ఈ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారని, వారి చర్యలు చట్టవిరుద్ధమని తెలిపింది. ఆస్తిపై హక్కు ఉన్నట్లు చూపి ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించింది. మోసపూరిత పద్ధతిలో ఆస్తిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నందున అక్రమార్కులపై 2014లోనే (క్రైమ్‌ నంబరు 290/2014) కేసు నమోదైనట్లు పేర్కొంది. ఇదే క్రమంలో ఈ నెల 22న తెల్లవారుజామున 5 గంటలకు వాసిరెడ్డి శివనారాయణ, వారి బంధువులు గుంపుగా వచ్చి స్థలం వద్ద కాపలా ఉన్న సిబ్బందిని బెదిరించి, దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించేందుకు యత్నించారని తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణకు పాల్పడే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది.

ఆక్రమణదారులపై కేసు నమోదు

ఆక్రమణదారులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు (క్రైమ్‌ నంబరు 237/2026) నమోదు చేసి విచారణ చేస్తున్నారని తెలిపింది. బీఎన్‌ఎస్ 329(3), 324(4), 115(2), 351(2), 189(2), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, కాంక్రీట్‌ మిక్సర్‌, కంటైనర్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.

Updated Date - Mar 24 , 2026 | 05:14 AM