Share News

డిఫాల్ట్‌ మిల్లర్లపై ఉక్కుపాదం

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:38 AM

ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించని డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బకాయిల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైతే ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాల

డిఫాల్ట్‌ మిల్లర్లపై ఉక్కుపాదం

పెద్దపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించని డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బకాయిల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైతే ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని 143 మంది డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల నుంచి సుమారు రూ. 6,500 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో 143 రైస్‌ మిల్లులు డిఫాల్ట్‌ జాబితాలో ఉండగా, వీటి నుంచి రావాల్సిన ధాన్యం విలువ రూ.531.43 కోట్లకు పైగా ఉంది. ఇప్పటికే 105 మిల్లుల్లో కొంతమేర రికవరీ చేసినప్పటికీ, ఇంకా భారీ మొత్తంలో ధాన్యం, బియ్యం బకా యిలు వసూలు కావాల్సి ఉంది.

ఫ కొంత రికవరీ.. భారీగానే బకాయిలు

జిల్లాలోని 143 డిఫాల్ట్‌ రైస్‌ మిల్లుల్లో ఇటీవల 105 మిల్లుల నుంచి కొంతమేర రికవరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో 86,247.908 క్వింటాళ్ల మేర రికవరీ జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ధాన్యం విలువ రూ.298 కోట్ల 11 లక్షల 33 వేల 420 రూపాయలుగా ఉంది. మిల్లర్ల నుంచి ఇంకా 62,332 క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉంది. వీటి విలువ రూ. 23 కోట్ల 31 లక్షల 71 వేల 963 రూపాయలుగా ఉంది. దీంతో ధాన్యం రికవరీతో పాటు బియ్యం బకాయిల వసూలుపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఫ ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు

డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల నుంచి బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మిల్లర్ల వివరాలను సేకరిస్తోంది. ఈ టీమ్‌ ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని డిఫాల్ట్‌ రైస్‌ మిల్లులను తనిఖీ చేస్తూ సమగ్ర వివరాలు సేకరిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం పెద్దపల్లి కలెక్టరేట్‌లోని పౌర సరఫరాల సంస్థ వారి క్యాంపులో ఉంది. ఈ బృందం ప్రతి రెండు రోజులకు ఒకసారి జిల్లాలో పర్యటిస్తూ డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లను సంప్రదిస్తోంది. మిల్లర్ల వద్దకు వెళ్లి బకాయిల చెల్లింపులపై ఆరా తీయడంతో పాటు, ఎప్పుడు డబ్బులు చెల్లిస్తారు? ఎంత మొత్తం చెల్లించగలరు? బకాయిల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశాలపై వివరాలు నమోదు చేస్తున్నారు. అదే సమయంలో మిల్లర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములకు సంబంధించిన ఆస్తుల వివరాలపైనా ఆరా తీస్తున్నారు.

ఫ మరింత బిగుస్తున్న ఉచ్చు

పెద్దపల్లి జిల్లాలో డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల వ్యవహారంలో ఇప్పటికే తొమ్మిది మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పలువురు జైలుకు కూడా వెళ్లారు. మరో 17 మంది తమపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకు కోర్టులను ఆశ్రయించారు. ఒకరిపై పీడీ యాక్ట్‌ నమోదైంది. కేసులు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతు న్నప్పటికీ, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

ఫ మరో 45 రోజుల గడువు

పెద్దపల్లి జిల్లాలో డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లకు వారం రోజుల క్రితం ప్రభుత్వం మరో 45 రోజుల గడువు ఇచ్చింది. అయితే గడువు ఇచ్చినా గత బకాయిలు చెల్లించనంత వరకు కొత్తగా ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కోటాను ఈ డిఫాల్ట్‌ మిల్లులకు ఇవ్వరని తేల్చారు. దాంతో ఇకపై గడువు ఇచ్చి వదిలేసే పరిస్థితి ఉండక పోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ప్రతి రెండు రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తుండటం, ఆస్తుల రికార్డులను పరిశీలిస్తుండటం బకాయిల వసూళ్లకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.

Updated Date - Oct 29 , 2026 | 12:38 AM