ముక్కోటి దేవతలకు ఆహ్వానం
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:26 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసా గుతున్నాయి.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 19, (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసా గుతున్నాయి. గురువారం రెండో రోజు ప్రధానాలయంలో స్వామివారి వేడుకలు అర్చకులు, వేదపండితులు, రుత్వికులు శ్రీకారం చుట్టారు. అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, దేవతాహ్వానం, హోమాది పూజలు, రుత్వి కుల పారాయణాలు ఆగమశాస్త్రరీతిలో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తిరుకల్యాణ వేడుకలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు మహావిష్ణువు ఇష్టవాహనం గరుత్మంతుడిని ఆహ్వానించేందుకు జరిపే తంతే ఈ ధ్వజారోహణం. గరుడాళ్వార్ల చిత్రపటం వద్ద పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో అలంకరించి స్వామిఅమ్మవారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. వేదమంత్రాలతో దేవతలకు అర్చించి గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రించి ఉత్తర తిరువీధిలోని యాగశాల నుంచి ఊరేగింపుగా ఆలయంలోని ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేశారు. ఉదయం అర్చకులు, పండితుల వేద, మంత్రోచ్చారణలు, నాదస్వర సప్త స్వరాగాల మధ్య సాగింది. గరుత్మంతుడిని ఆహ్వానించేందుకు గరుఢ ముద్దలను ఎగురవేశారు.
హోమ పూజలు
స్వామివారి తిరుకల్యాణ వేడుకలకు దేవతాహ్వానం తర్వాత పంచసూక్తములతో సంతృప్తి పరిచే హవనం వైభవంగా ప్రారంభిం చారు. స్వామివారి నరసింహ మూలమంత్ర జపాలు, పారాయణాలు, మహాలక్ష్మీ మూలమంత్ర జపాలు హవిస్సుల రూపంలో అందజేశారు. ఆలయంలో బ్రహ్మోత్సవ కైంకర్యాలను ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు అర్చక బృందం, వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆస్థాన విద్వాంసులు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిపారు. ఉత్సవాల్లో దేవస్థాన ఈవో జే. భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహ్మమూర్తి, కలెక్టర్ ఎం. హనుమంతరావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, గజ్వేల్లి రమేష్‌బాబు, రఘు, పర్యవేక్షకులు కలకోట సీతరామచార్యులు, కే. నటరాజు, మాచర్ల రాజన్‌బాబు, వాసం వెంకటేశ్వర్లు, ఉద్యోగ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేటి నుంచి అలంకరణలు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ఆలయంలో ఉదయం ఏడు అలంకార సేవలు, సాయంత్రం ఆరు వాహన సేవలో విహరిస్తారు. కాగా, సంగీత, ధార్మిక, సాహిత్య సభలు ఎనమిది రోజుల పాటు కళాతోరణంలో వైదిక ప్రార్ధన, మంగళవాద్యం, భజనలు, భక్తి సంగీతం, హరికథ, సంగీత విభావరీ, సంకీర్తనలు, శాస్త్రీయ నృత్యాలు, ధార్మిక ఉపన్యాసాలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు, చిందు యక్షగానాలు, వేణుగానం, వీణవాద్యం, కర్ణాటక సంగీతం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28 వరకు మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని లోకాయుక్త జడ్జీ ఏ. రాజశేఖర్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఈవో జే. భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పకగా, గర్భాలయంలో స్వయంభువులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో వారికి ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు బృందం వేద ఆశీర్వచనం చేయగా ఈవో జే. భవానీశంకర్ లడ్డు ప్రసాదం అందజేశారు.