Share News

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై షా వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:15 AM

సల్వాజుడుం కేసులో జీవించే హక్కుకు రక్షణ కల్పిస్తూ 2011లో అప్పటి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను పౌర...

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై షా వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే

  • సల్వాజుడుం తీర్పును వక్రీకరించారు

  • ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి

  • ప్రశ్నించే గళాలపై అర్బన్‌ నక్సల్‌ ముద్ర తగదు

  • పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): సల్వాజుడుం కేసులో జీవించే హక్కుకు రక్షణ కల్పిస్తూ 2011లో అప్పటి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను పౌర సమాజం ఖండించింది. దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేసింది. దానిని నక్సలైట్ల అనుకూల తీర్పుగా అమిత్‌ షా పరిగణించడాన్ని తప్పుపట్టింది. గౌరవ న్యాయమూర్తికి వ్యక్తిగత ఉద్దేశాలు ఆపాదించడం అత్యంత దుర్మార్గమని విమర్శించింది. తద్వారా మిగతా న్యాయమూర్తులపై బెదిరింపులకు పాల్పడడమేనని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక పోకడలను ప్రశ్నించే వారిపై అర్బన్‌ నక్సల్‌ ముద్రవేయడం ఒక దుర్మార్గ సంస్కృతి అని, దాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై అమిత్‌షా విమర్శలకు నిరసనగా శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌరహక్కుల సంఘాలు, అఖిల భారత లాయర్స్‌ యూనియన్‌ సంయుక్త నిర్వహణలో ‘భారత రాజ్యాంగం-న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశం పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఆచార్య హరగోపాల్‌ అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజని మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూలాధారమైన న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిపై అమిత్‌ షా వ్యక్తిగత దాడికి పాల్పడ్డారని విమర్శించారు. సల్వాజుడుం తీర్పు తాను క్షుణ్ణంగా చదివానని, అందులో మావోయిస్టులకు లేదా మావోయిస్టు సిద్ధాంతానికి ఎక్కడా అనుకూలంగా లేదన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలను ప్రజాస్వామ్య ఆలోచనా స్రవంతిమీద దాడిగా చూడాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. చట్టసభల అధికారాలను అమిత్‌ షా దుర్వినియోగం చేశారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి తప్పుబట్టారు. కోర్టు ధిక్కరణ కింద అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలని సీనియర్‌ న్యాయవాదులు నందిగామ కృష్ణారావు, సురేష్‌, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు పార్థసారధి, శ్రీకాంత్‌ చింతల తదితరులు డిమాండ్‌ చేశారు. మానవ హక్కుల వేదిక జీవన్‌కుమార్‌, ఆర్థికశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి, వీక్షణం వేణుగోపాల్‌, శాస్త్రవేత్త బాబూరావు, మురళీ కరణం, ప్రొ. అన్వర్‌ఖాన్‌ తదితరులంతా అమిత్‌షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. దీనిని న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే కుట్రగా భావించాలని, జిల్లా నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిల బార్‌ అసోసియేషన్లలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని తీర్మానించారు.

Updated Date - Apr 12 , 2026 | 04:15 AM