Share News

నక్సల్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: షా

ABN , Publish Date - May 19 , 2026 | 05:26 AM

దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే తమ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

నక్సల్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: షా

  • ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సన్మానం

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే తమ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీసు ఉన్నతాధికారులను ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన సన్మానించారు. తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌, రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి. శివధర్‌రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌) అనిల్‌ కుమార్‌, మల్కాజిగిరి కమిషనర్‌, మాజీ ఎస్‌ఐబీ ఐజీపీ సుమతితో పాటు ఆమె నేతృత్వంలోని ఎస్‌ఐబీ బృందాన్ని అమిత్‌షా సత్కరించి, వారి విశేష సేవలను అభినందించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని తాము నిర్ణయించినప్పుడు చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ, స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందు వెళ్ళామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చరిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు. దేశ ప్రజలు 1970 నుంచి దాదాపు మూడు తరాల పాటు నక్సలిజం అనే పీడకలను చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతంతో అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకారమవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తుచేశారు. నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే ఈ విజయం సాధ్యమైందని అమిత్‌షా పేర్కొన్నారు.

Updated Date - May 19 , 2026 | 05:26 AM