Share News

అక్రమార్కులకు అండ.. చిరుద్యోగులపై కొరడా!

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:12 AM

చిరుద్యోగులకో న్యాయం.. అక్రమార్కులకో న్యాయం.. హెచ్‌ఎండీఏ అధికారుల ద్వంద్వ నీతికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. అమీన్‌పూర్‌ ప్రాంతంలో 17 లే అవుట్లలో 2,442 వరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వారిని కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి

అక్రమార్కులకు అండ.. చిరుద్యోగులపై కొరడా!

  • అమీన్‌పూర్‌లో అధికారుల ఇష్టారాజ్యం

  • ప్లాట్ల యజమానుల కన్నీళ్లకు కారకులు వీరే

  • తూములు మింగేసినా.. వరద కాల్వలను మూసేసినా ఎన్వోసీలు, అనుమతులు జారీ

  • ఇప్పటికీ అక్రమార్కులకు అండదండలు

  • ప్లాట్ల యజమానుల ఫైళ్లు మాత్రం మూలకే

చిరుద్యోగులకో న్యాయం.. అక్రమార్కులకో న్యాయం.. హెచ్‌ఎండీఏ అధికారుల ద్వంద్వ నీతికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. అమీన్‌పూర్‌ ప్రాంతంలో 17 లే అవుట్లలో 2,442 వరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వారిని కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. వారిలో అత్యధికులు పేద, మధ్య తరగతి కుటుంబీకులే. పైసా.. పైసా కూడబెట్టి కొన్నవాళ్లు కొందరైతే.. ప్రతి నెలా ఈఎంఐ మాదిరిగా చెల్లింపులు చేసి కొన్నవారు మరికొందరు. రిటైర్మెంట్‌ డబ్బులతో ఇంకొందరు కొంటే.. ఊళ్లో స్థలాన్ని అమ్మి కొన్నవాళ్లు మరికొందరు. స్టాఫ్‌ నర్సుగా చేసి రిటైరైన రాజేశ్వరి కూడా హెచ్‌ఎంటీ కాలనీని ఆనుకుని ఉన్న ప్లాట్‌ను 25 ఏళ్ల కిందట కొన్నారు. ఆమె సోదరి, రిటైర్డ్‌ టీచర్‌ ఉమ కూడా ఆ పక్కనే మరో ప్లాట్‌ కొనుక్కున్నారు. సొంతిళ్లు కట్టుకోవడానికి పదేళ్లుగా శ్రమిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించారు. పంచాయతీ, మున్సిపల్‌ ఆఫీసుల చుట్టూ తిరిగారు. తిరిగి తిరిగి.. ఆమె గుండెకు 8 స్టంట్లు పడ్డాయి. గత ఏప్రిల్‌లో క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. సొంతిల్లేమో కానీ.. కనీసం ఆస్తిగా ఉన్న ప్లాట్‌ను అమ్ముకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే కొనే దిక్కులేదు. ప్లాట్లు కొన్న 25-30 ఏళ్ల తర్వాత వాటిని అమీన్‌పూర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌గా నిర్ణయించడంతో వందలాది కుటుంబాలు బాధితులుగా మారాయి.


వెళ్లని ఆఫీసు లేదు.. కలవని అధికారి లేరు

ఉమ్మడి రాష్ట్రంలోనే అమీన్‌పూర్‌ పరిసర ప్రాంతాల్లో అప్పటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పలుకుబడి కలిగిన నేతలు పెద్దఎత్తున లే అవుట్లు చేశారు. కొందరు ఐదెకరాల్లో.. మరికొందరు 20-30 ఎకరాల్లో వేశారు. గ్రామ పంచాయతీ అనుమతులతో కొన్ని లే అవుట్లు రాగా.. మరికొన్నిటికి అప్పటి హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(హుడా) అనుమతులు ఇచ్చింది. ఇదంతా 1998-2005 మధ్య జరిగింది. పైసా పైసా కూడబెట్టుకుని వీటిని కొనుగోలు చేసిన వారిలో పేద, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. ఈ క్రమంలో హుడా కాస్తా హెచ్‌ఎండీఏగా మారింది. అమీన్‌పూర్‌ చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్‌ నిర్ణయిస్తూ 2019లో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీచేసింది. 93 ఎకరాల చెరువును ఒక్కసారిగా 464 ఎకరాలకు ఎలా పెంచుతారంటూ ప్లాట్ల యజమానులు అభ్యంతరాలు తెలిపారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు అందజేశారు. రెవెన్యూ అధికారుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు తిరిగి బాధితులు కుంగిపోతున్నారు.

అసలు దోషులు అధికారులే

అమీన్‌పూర్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అంటే.. ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం రెవెన్యూ, ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ అధికారులే! చెరువు తూములు మింగేసినా.. కాల్వలను కబ్జా చేసినా అనుమతులు ఇచ్చేశారు. చెరువు తూములను ఎక్కడికక్కడే మూసేసినా.. వరద కాల్వలను మట్టితో పూడ్చేసినా.. ఆకాశాన్ని తాకే నిర్మాణాలకు అడ్డగోలుగా అధికారులు అనుమతులు ఇచ్చేశారు. కుతుబ్‌షాహీల పాలనలో అబ్దుల్‌ ఖదీర్‌ అమీన్‌ఖాన్‌ పెద్ద చెరువు నిర్మించగా.. దిగువన పంట పొలాలకు నీళ్లు ఇవ్వడానికి నాలుగు తూములను ఏర్పాటు చేశారు. వాటి సిస్టర్న్‌లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇక్కడ గొడుగు తూము, కుక్కల తూము, గుంటి పోశమ్మ తూము, కొచ్చెరు తూము ఉండేవని స్థానికులు చెబుతున్నారు. హెచ్‌ఎండీఏ మాత్రం తన ప్రిలిమినరీ నోటిఫికేషన్లో మూడింటినే పేర్కొంది. అయితే, దుర్భిణి వేసి వెతికినా వాటి కాల్వలు కనిపించడం లేదు. సాయిబాబా గుడి వద్ద గొడుగు తూముకు దిగువ ఎక్కడా కాల్వలు లేవు. నిర్మాణాలు వచ్చేశాయి. దీని నుంచే పటేల్‌గూడెం వైపు వరద కాల్వ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కట్ట మైసమ్మ ఆలయం దగ్గర కుక్కట తూము దిగువన ఉన్న కాల్వలన్నీ మూసేశారు. తూము ఎదురుగా ఉండాల్సిన కాలువ మార్గంలో ఓ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక, పెద్దచెరువు చివరన ఉండే గుంటి పోశమ్మ తూమునూ మూసేశారు. అక్కడ ఒక్క కాలువ కనిపించదు. వరద కాల్వల ఆనవాళ్లు లేకుండా నిర్మాణాలు వస్తున్నాయి. చెరువు దిగువన భారీగా వస్తున్న బహుళ అంతస్తుల భవనాలకు వరద కాల్వలు లేవని ఇరిగేషన్‌ అధికారులు నిర్ధారించడంతోనే అనుమతులు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక, కొచ్చెరు తూమును ఇరిగేషన్‌ అధికారులు అసలు గుర్తించడమే లేదు. వరద కాల్వలు పట్టా భూముల్లో ఉన్నా అవి ఇరిగేషన్‌ శాఖ పరిధిలోకే వస్తాయి. పట్టణీకరణలో వాటిని బాక్స్‌ డ్రెయిన్‌గా మార్చాలి. అయితే, బహుళ అంతస్తుల భవనాలకు ఎన్‌వోసీలు జారీ చేసిన ఇరిగేషన్‌ అధికారులు బాక్స్‌ డ్రెయిన్‌ కట్టాలంటూ ఎలాంటి షరతులు పెట్టలేదు. పంట కాల్వలను పాతరేసి ఇష్టానుసారంగా ఎన్‌ఓసీలు జారీ చేశారు. ఉదాహరణకు, అమీన్‌పూర్‌ చెరువు నీరు దిగువన సంబి చెరువుకు వెళ్లేలా వరద కాల్వ ఉండేది. పైపులూ స్పష్టంగా కనిపించేవి. గతంలో ఓసారి ఇక్కడ భవన నిర్మాణానికి పిల్లర్లు వేస్తుండగా.. అలుగు నీరు పోయే మార్గమంటూ ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. పిల్లర్లను కూల్చేశారు. కానీ, ఇప్పుడు ఆ నీరు పోయే పైపులను మట్టితో కప్పేశారు. గతంలో కూల్చిన నిర్మాణాలకు చుట్టూ గ్రీన్‌ పట్టా అడ్డం పెట్టేసి నిర్మాణాలు యథావిధిగా చేపడుతున్నారు. దాని ఎదురుగా ఓ ప్రైవేటు ఆస్పత్రి గల భవనాన్ని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఎలాంటి అనుమతులు లేకుండా కట్టారనే ఆరోపణలున్నాయి. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదు.

- హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి)


ఈయన పేరు సత్యనారాయణ. ఆల్విన్‌ కంపెనీలో చిన్నస్థాయి ఉద్యోగి. నెలవారీగా వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోయేది. కూతురు పెళ్లి కోసం లక్షల రూపాయాలు పొదుపు చేయలేమని.. తన పీఎఫ్‌ డబ్బులు డ్రా చేసి 1998లో అమీన్‌పూర్‌లో 200 గజాల ప్లాట్‌ కొన్నారు. ఆ కుటుంబానికి అది తప్ప వేరే ఆస్తి లేదు. పెళ్లీడుకు వచ్చిన కుమార్తెకు ఇటీవల ప్లాట్‌ను విక్రయించి వచ్చిన డబ్బులతో పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ, ఆనాడు కొనుగోలు చేసిన ప్లాట్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని హైడ్రా అధికారులు చెప్పారు. కొనేవాళ్లు లేరు. దాంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కూతురు పెళ్లి ఎలా చేయాలని ఆ తండ్రి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

Untitled-4 copy.jpg


ఈ ఫొటో చూశారా!? అమీన్‌పూర్‌ పెద్ద చెరువు అలుగు పైప్‌ లైన్‌ను మట్టితో పూడ్చివేసిన దృశ్యమిది. ఆ పక్కనే పచ్చటి పరదా కట్టారు కదా..! చెరువు అలుగుపై నిర్మిస్తున్నారంటూ గతంలో ఇక్కడ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇప్పుడు అక్కడే మళ్లీ నిర్మాణం చేపట్టారు. దీనికి అనుమతుల్లేవు. అలుగు పైప్‌లైన్‌ పూడ్చేసినా.. నిర్మాణాలు చేపడుతున్నా గతంలో కూల్చిన ఇరిగేషన్‌ అధికారులు కానీ, హెచ్‌ఎండీఏ అధికారులు కానీ కిమ్మనడం లేదు.


నీళ్లు పోయే మార్గాలు లేవు..

నాకు ఇప్పుడు 80 ఏళ్లు. మూడు తరాల నుంచి మా కుటుంబం ఈ చెరువులో చేపలు పడుతోంది. అప్పుడు మొత్తం వర్షం నీళ్లుండేవి. ఇప్పుడంతా మురుగు చేరుతోంది. పెద్ద చెరువు, ఆ తర్వాత బంధం కొమ్ము చెరువు ఆ తర్వాత బీరంగూడెం సుబ్బని చెరువు అక్కడి నుంచి పటన్‌ చెరువులోని సాకి చెరువులోకి వెళ్తాయి. ఇవన్నీ గొలుసు కట్టు చెరువులు. ఇప్పుడు ఒక చెరువుకు, ఇంకో చెరువుకు నీళ్లు పోయే మార్గాలు లేవు. తూములన్నీ మూసేశారు.

- రాట్నాల స్వామి ముదిరాజ్‌,

మత్స్య సొసైటీ సభ్యుడు

మా అమ్మ గుండెకు సర్జరీ చేయాలి

హెచ్‌ఎంటీ కాలనీకి దగ్గరలోనే దాదాపు 30 ఏళ్ల కిందట మా అమ్మ, నాన్న 220 గజాల ప్లాట్‌ కొన్నారు. అక్కడ ఇల్లు కట్టుకోవాలనేది మా కల. ఇప్పుడు ఎఫ్‌టీఎల్‌గా చెప్పడంతో ఇంటి అనుమతి రావడం లేదు. మా అమ్మ హార్ట్‌ పేషెంట్‌. సర్జరీ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. అందుకు అవసరమైన డబ్బుల్లేవు. ప్లాట్‌ అమ్మి వైద్యం చేయించాలనుకున్నా.. కొనేందుకు ఎవ్వరూ ముందుకు వస్తలేరు. ప్లాట్‌ పెట్టుకొని డబ్బులు ఇచ్చేందుకు ఎవ్వరూ రావడం లేదు.

- ప్రశాంతి, బాధితురాలు

Updated Date - Feb 08 , 2026 | 06:15 AM