అమీన్‌పూర్.. అచ్చెరువు!!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:19 AM
ఎస్‌ఎస్ రామకృష్ణ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తారు. 2005లో అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 150లో ప్లాటు కొనుక్కున్నారు. ప్లాటు కొనుక్కునేటప్పుడే అన్ని రకాల పత్రాలూ చూసుకుని కొనుక్కున్నారు.
హెచ్‌ఎండీఏ వింతలు.. 2,500 మంది ప్లాట్ యజమానులకు కన్నీళ్లు
2005లో రెసిడెన్షియల్‌గా ఉన్న ప్రాంతాలు 2017 నాటికి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి
రోజురోజుకూ ‘పెరుగుతున్న’ పెద్ద చెరువు.. 93 ఎకరాల నుంచి 464 ఎకరాలకు..!
వరద నీరు వెళ్లే దారిలేక.. మురుగు నీరు చేరడంతో పెరుగుతున్న నీటి నిల్వ ప్రాంతం
పెద్ద చెరువు, కొత్తకుంటలను కలిపేసి ఎఫ్‌టీఎల్ పెంచేసిన హెచ్‌ఎండీఏ
కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్లను కోల్పోయి వాటి యజమానుల గగ్గోలు
వారిని ఆదుకుంటామని మొదట్లో హామీ ఇచ్చిన హైడ్రా కూడా ఇప్పుడు యూటర్న్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎస్ రామకృష్ణ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తారు. 2005లో అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 150లో ప్లాటు కొనుక్కున్నారు. ప్లాటు కొనుక్కునేటప్పుడే అన్ని రకాల పత్రాలూ చూసుకుని కొనుక్కున్నారు. చివరకు, 2005 జూలై 21న హెచ్‌ఎండీఏ నుంచి ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అప్పటి మాస్టర్‌ప్లాన్ ప్రకారం.. ఆయన కొనుగోలు చేసిన ప్లాట్ స్థలం రెసిడెన్షియల్ జోన్‌గా పేర్కొంటూ హెచ్‌ఎండీఏ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ జారీ చేసింది. దాన్ని ఆధారంగా చేసుకొనే ప్లాట్ కొన్నారు. కానీ, పుష్కరం తిరిగేసరికి అదే హెచ్‌ఎండీఏ.. అదే సర్వే నంబరు 150 చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉందంటూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా.. రెక్కల కష్టంతో కొనుక్కున్న ఆ స్థలంలో ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకోలేరు. స్థలాన్ని అమ్ముకోలేరు.
... రామకృష్ణ ఒక్కరిదే కాదు.. అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని దాదాపు 2500 మంది పరిస్థితి ఇదే. వీరంతా చిరుద్యోగులు. కొందరు పీఎఫ్ తీసుకుని.. మరికొందరు అప్పులు చేసి.. ఇంకొందరు ఈఎంఐ ద్వారా ఇక్కడ స్థలం కొనుక్కున్నారు. కొందరు సొంతింటి కలను సాకారం చేసుకుందామని.. మరికొందరు పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులకు పనికి వస్తుందని తీసుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ మిగిలింది కన్నీళ్లే! ఇందుకు కారణం హెచ్‌ఎండీఏనే!!
93 ఎకరాల చెరువు.. 464 ఎకరాలకు..!
సాధారణంగా కబ్జాల కారణంగా కాలం గడిచేకొద్దీ చెరువు ఏదైనా కుచించుకుపోతుంది. వందల ఎకరాల చెరువు అస్సలు కనిపించకుండా మాయమవడమూ చూస్తున్నాం. కానీ, అమీన్‌పూర్‌లో వింత పరిస్థితి. ఇక్కడ 2016లో 90 ఎకరాలున్న చెరువు పదేళ్లు గడిచేసరికి 464 ఎకరాలకు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం.. చెరువులోకి వచ్చే వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం. తూములు, కాల్వలపై నిర్మాణాలకు హెచ్‌ఎండీఏనే అనుమతులు ఇవ్వడం. మరొకటి.. ఎగువ ప్రాంతాల్లోని కాలనీల నుంచి మురుగు నీరంతా అమీన్‌పూర్ చెరువులోనే కలవడం. నిజానికి, మియాపూర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండే శివారు ప్రాంతం అమీన్‌పూర్. ప్రస్తుతం ఇక్కడ ఐటీ కారిడార్‌తో పోటీ పడేలా ఆకాశ హర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్‌కు అవకాశం ఉన్న ఈ ప్రాంతంపై సాధారణంగానే కబ్జాదారుల కన్ను పడింది. చెరువులను చెరబట్టే అక్రమార్కులు ఇక్కడ రూటు మార్చారు. చెరువు జోలికి వెళ్లకుండా అలుగు, నాలాల వెంట ఉన్న స్థలాలను ఆక్రమించారు. మూడు దశాబ్దాల క్రితమే అక్కడి చెరువు చుట్టూ లే అవుట్‌లు అభివృద్ధి చేశారు. హుడా అనుమతితో కొన్ని, పంచాయతీ పర్మిషన్‌తో మరికొన్ని లే అవుట్‌లు చేసి ప్లాట్లు విక్రయించారు. నిజానికి, అప్పటికి ఈ వెంచర్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో లేవు. కానీ, చెరువు తూములు, కాల్వలపై నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ పోవడంతో వరద నీరు బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. బయటి నుంచి మురుగు నీరు నిరంతరం వచ్చి చేరుతోంది. దాంతో, ఏటికేడు చెరువు ఎఫ్‌టీఎల్‌ను పెంచుకుంటూపోయారు.
ఒక్కోసారి ఒక్కోలా..
పెద్ద చెరువు నిర్మాణ సమయంలో రూపొందించిన మెమోరీస్ ప్రకారం చెరువు విస్తీర్ణం 93.15 ఎకరాలు (37.786 హెక్టార్లు)గా ఉందని ప్లాట్ల యజమానులు చెబుతున్నారు.
జూన్ 21, 2021న ప్రభుత్వం తరపున నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు సమర్పించిన సంయుక్త నివేదికలో పెద్ద చెరువు విస్తీర్ణం 93.15 ఎకరాలుగా చూపారు. వాటర్ స్ర్పెడ్ ఏరియా 196 ఎకరాలు, బఫర్ జోన్ 55.23 మీటర్లుగా చూపారు.
2016లో అమీన్‌పూర్ చెరువును జీవ వైవిధ్య జలాశయంగా ప్రకటించేందుకు జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లోనూ చెరువు విస్తీర్ణం 93.15 ఎకరాలుగా.. శిఖం, పక్కనున్న పట్టా ల్యాండ్ 170 ఎకరాలుగా పేర్కొన్నారు.
కానీ, పెద్ద చెరువు విస్తీర్ణం 453.459 ఎకరాలుగా మార్చి 20, 2017న హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 2019లో మరోసారి చెరువు విస్తీర్ణం 464.23 ఎకరాలుగా చూపుతూ అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
రెండు చెరువులను కలిపి..
వరద, మురుగు నీరు కారణంగా అమీన్‌పూర్ చెరువులో నీటి నిల్వ ప్రాంతం పెరుగుతోంది. అప్పుడు దాని ఎఫ్‌టీఎల్‌ను కూడా మార్చాలి కదా! అందుకే, అధికారులు అమీన్‌పూర్ చెరువును సమీపంలోని కొత్తకుంట చెరువుతో కలిపేశారు. నిజానికి, 1970, 80ల నాటి రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల రికార్డుల ప్రకారం అమీన్‌పూర్ పెద్ద చెరువు, కొత్త కుంటకు వేర్వేరు ఐడీలు ఉన్నాయి. పెద్ద చెరువు ఐడీ 1200-34 కాగా.. కొత్తకుంట ఐడీ 1200-33. సీరియల్ నంబర్ 231లోని పెద్ద చెరువు నీటి నిల్వ ప్రాంతం 93.15 ఎకరాలు కాగా.. కొత్తకుంట 7.39 ఎకరాల్లో ఉంది. రెండూ ఒకే కాంటూర్ లెవల్‌లో ఉన్నా.. రెండింటి మధ్య నాలా లేదు. కుతుబ్ షాహీల కాలంలో పెద్ద చెరువు నిర్మించగా.. 1956 తర్వాత కొత్తకుంట తవ్వారు. సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్లు, రెవెన్యూ కెడస్ట్రియల్ మ్యాపులు, నాలుగైదు దశాబ్దాల కిందటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) శాటిలైట్ చిత్రాల ప్రకారం చెరువుల విస్తీర్ణం 93.. 10 ఎకరాలుగా ఉంది. రెండు చెరువుల మధ్య లింక్ లేదు. కానీ, ఇప్పుడు వాటిని కలిపేశారు. కొత్తకుంట అలుగును ప్రస్తుతం పెద్ద చెరువు అలుగుగా చూపుతున్నారు. అధికారులు చెబుతున్నట్టు.. 450 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉండే చెరువు అలుగు కేవలం పది అడుగులలోపు వెడల్పుతో ఉంటుందా..? అమీన్‌పూర్ చెరువుకు గతంలో ఉన్న అలుగులతో పోలిస్తే కొత్తకుంట అలుగు గరిష్ఠ ఎత్తులో ఉంది. అక్కడి నుంచి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. దాంతో, నీటి నిల్వ ప్రాంతం క్రమేణా పెరుగుతోంది. అంతేనా.. పెద్ద చెరువుకు ఓవైపు అలుగు, మరోవైపు నీళ్లు వెళ్లేలా బైపాస్ ఉండింది. ఆ రెండింటినీ కొన్నాళ్ల క్రితం మూసివేశారు. తూములూ మూతపడడంతో దిగువకు నీరు వెళ్లే అవకాశం మూసుకుపోయింది. దాంతో, రెండు చెరువులను కలిపేశారు.
హైడ్రా యూ టర్న్...
‘నగరంలోని అన్ని చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. కానీ, అమీన్‌పూర్ పెద్ద చెరువు వద్ద వింత పరిస్థితి ఉంది. అక్రమ నిర్మాణాలతో ఇక్కడ చెరువు విస్తీర్ణం పెరిగింది. రికార్డులు పరిశీలించి వాస్తవ విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారిస్తాం’ అని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో హైడ్రా పేర్కొంది. అధికారులు పలుమార్లు చెరువును సందర్శించారు. అప్పుడు కూడా స్థానికులకు అదే భరోసా ఇచ్చారు. చెరువును చెరబట్టి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు చేసిన ఆక్రమణలు తొలగించారు. దీంతో అక్కడి ప్లాట్ల యజమానులు సంబరపడ్డారు. న్యాయం జరుగుతుందని ఆనందించారు. కానీ, ఇప్పుడు అదే హైడ్రా యూటర్న్ తీసుకుంది. పెద్ద చెరువు మొత్తాన్ని చెరువుగానే పరిగణిస్తామని, మీరు టీడీఆర్‌లు తీసుకోండని ప్లాట్ల ఓనర్లతో బేరసారాలు చేస్తోంది. కాదు కూడదంటే చట్ట ప్రకారం భూసేకరణ చేస్తామని భయపెడుతోంది. ఇందుకోసం వెంచర్ల వారీగా ఏర్పాటైన సంఘాల పెద్దలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. కానీ, అక్కడి మార్కెట్ ధరకు, ప్రభుత్వం ఇచ్చే ధరకు భారీ వ్యత్యాసం ఉండడంతో ప్లాట్ల యజమానులు అంగీకరించడం లేదు. అంతేనా.. ‘‘మాయమైన అలుగులు, తూములు పునరుద్ధరిస్తామన్న హైడ్రా ఇప్పుడు ఎందుకిలా వ్యవహరిస్తోంది? ఇతర చెరువులకు రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) వద్ద ఉన్న 1970, 80ల నాటి రికార్డులను పరిగణనలోకి తీసుకుంటోన్న సంస్థ.. అమీన్‌పూర్ పెద్ద చెరువు విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు!? 2006 నుంచి అందుబాటులో ఉన్న సమాచారం ప్రామాణికమని ఎందుకు చెబుతోంది!?’’ అని ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు.
జీవ వైవిధ్యం ఏదీ..!?
అమీన్‌పూర్ చెరువును ఒకప్పుడు పక్షుల స్వర్గధామంగా పేర్కొనేవారు. దానిని జీవవైవిధ్య వారసత్వ సంపదగా గుర్తించారు. దేశ, విదేశీ పక్షులు గతంలో భారీగా ఇక్కడకు వలస వచ్చేవి. 171 రకాల పక్షులు, 250 రకాల మొక్కలు, తొమ్మిది రకాల చేపలు, 26 రకాల క్రిమికీటకాలు, 41 రకాల సీతాకోకచిలుకలు, 22 రకాల సకశేరుకాలు, 12 రకాల ఉభయచరాలు, 33 రకాల సరీసృపాలు, 9 రకాల వన్యప్రాణులు, తృణధాన్యాలతో కూడిన జీవవైవిధ్యం ఇక్కడ ఉండేది. చెరువును కాపాడేందుకు జీవవైవిధ్య చట్టం సెక్షన్ 41 (1) ప్రకారం జీవవైవిధ్య యజమాన్య కమిటీ ఏర్పాటు చేశారు. కానీ, భారీగా మురుగు నీరు చేరడం.. పారిశ్రామిక వ్యర్థాలూ చెరువులోకి చేరుతుండడంతో జలాశయం మురికి కూపంగా మారుతోంది. ఇప్పుడు పక్షులు, ఇతర జలచరాలు కనిపించడం లేదు.


