లారీల పోటీ.. ప్రాణానికి చెల్లుచీటీ!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:14 AM
ఇసుక లారీల డ్రైవర్లు రోడ్డంతా తమదే అన్నట్లుగా పోటాపోటీగా సాగించిన డ్రైవింగ్ కారణంగా భారీగా ట్రాఫిక్‌జామ్ నెలకొంది.
పోటాపోటీ డ్రైవింగ్‌తో రహదారిపై నిలిచిన 60 ఇసుక లారీలు
ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న అంబులెన్స్
బాధితుడిని 2 కి.మీ భుజాలపై వేసుకొని పరుగెత్తిన బంధువులు
సకాలంలో వైద్యం అందక యువకుడి మృతి.. మణుగూరులో విషాదం
మణుగూరు రూరల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఇసుక లారీల డ్రైవర్లు రోడ్డంతా తమదే అన్నట్లుగా పోటాపోటీగా సాగించిన డ్రైవింగ్ కారణంగా భారీగా ట్రాఫిక్‌జామ్ నెలకొంది. అందులో ఓ అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఆ వాహనంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గిరిజన యువకుడు మామూలుగానైతే నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి చేరేవాడు.. సకాలంలో వైద్యమూ అంది ప్రాణాలూ దక్కేవి! అయితే ట్రాఫిక్‌జామ్ కారణంగా అంబులెన్స్ చిక్కుకుపోవడం, గంటల తరబడి ఆలస్యం జరగడంతో బాధితుడి ప్రాణాలే పోయాయి. కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన ఈ ఘటన మృతుడి కుటుంబసభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. సోమవారం మణుగూరు మండలంలోని విజయనగరం, రామానుజవరం ఇసుక ర్యాంపుల నుంచి సుమారు 60 ఇసుక లారీలు ఒకేసారి రహదారిపైకి వచ్చాయి. డ్రైవర్లు పోటాపోటీగా డ్రైవింగ్ చేయడంతో ఎదురుగా వచ్చిన వాహనాలకు వెళ్లేందుకు అవకాశమే లేకుండా పోయింది. ఫలితంగా సాంబాయిగూడెం నుంచి రామానుజవరం వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో పినపాక మండలం గడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమరం వంశీ (30) అనే గిరిజన యువకుడు కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత నేరుగా మణుగూరు మండలం దమ్మక్కపేట బంధువుల ఇంటికి వచ్చాడు. వారికి విషయం చెప్పడంతో వారు అతడిని అంబులెన్స్‌లో ఎక్కించుకొని మణుగూరుకు బయల్దేరారు. ఆ అంబులెన్స్ సాంబాయిగూడెం వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. ఆస్పత్రికి వెళ్లేందుకు మరో 8 కి.మీ ప్రయాణించాల్సిఉండగా.. అంబులెన్స్‌కు దారి లేక వంశీని బంధువులు భుజాలపై 2కి.మీ దూరం దాకా మోసుకుని పోయి అక్కడ నుంచి ఓ ఆటోలో వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే వంశీ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేవలం ఇసుక లారీల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయం వల్లే వంశీ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కాంట్రాక్టర్లు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.