Share News

నాలెడ్జ్‌ సెంటర్‌గా అంబేడ్కర్‌ భవన్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:33 AM

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని శిథిలావస్థకు చేరిన అంబేడ్కర్‌ భవన్‌ను అత్యున్నత సదుపాయాలతో కూడిన ‘అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌’గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది.

నాలెడ్జ్‌ సెంటర్‌గా అంబేడ్కర్‌ భవన్‌

  • మోడల్‌ వసతి సముదాయంగా కాచిగూడ జగ్జీవన్‌ హాస్టల్‌

  • నిరుపేద యువత కోసం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని శిథిలావస్థకు చేరిన అంబేడ్కర్‌ భవన్‌ను అత్యున్నత సదుపాయాలతో కూడిన ‘అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌’గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. అదే సమయంలో జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం రాజధానికి వచ్చే నిరుపేద విద్యార్థుల కోసం కాచిగూడలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ కళాశాల విద్యార్థి వసతి గృహాన్ని (నింబోలి అడ్డా హాస్టల్‌ కాంప్లెక్స్‌) మోడల్‌ వసతి సముదాయంగా తీర్చిదిద్దనుంది. ఈ రెండు ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే దళిత, బడుగు, బలహీన వర్గాల యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలెడ్జ్‌ సెంటర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి గ్రంథాలయం, ఈ-లైబ్రరీ, డిజిటల్‌ లెర్నింగ్‌ హబ్‌ ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంకింగ్‌, ఎస్‌ఎస్‌సీ, రైల్వే వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక కోచింగ్‌ సదుపాయాలు, కెరీర్‌ గైడెన్స్‌, కార్పొరేట్‌ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఇది విద్యా వనరుల కేంద్రంగా మారనుంది.


ఇది వేలాది విద్యార్థుల కలల వేదిక : మంత్రి అడ్లూరి

ప్రభుత్వం నిర్మించబోయే అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ వేలాది మంది దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థుల కలల వేదిక అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. నిరుపేద విద్యార్థి కూడా హైదరాబాద్‌ నడిబొడ్డున అత్యున్నత పోటీ పరీక్షలకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా సిద్ధమవ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

Updated Date - Jun 08 , 2026 | 06:35 AM