Share News

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు పాటుపడదాం

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:31 AM

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అదే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు పాటుపడదాం

  • అదే.. రాజ్యాంగ నిర్మాతకు నిజమైన నివాళి

  • జయంతి వేడుకల్లో పలువురు వక్తల పిలుపు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అదే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, దానం నాగేందర్‌, నవీన్‌ యాదవ్‌, మందుల సామేల్‌, మాజీద్‌ హుస్సేన్‌, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు హాజరై అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన సభ వేదిక వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎస్సీలు, ఎస్టీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రే వంత్‌రెడ్డి నాయకత్వంలో అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ భవన్‌ స్థానంలో అంబేడ్కర్‌ నాలెడ్జి టవర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొని మాట్లాడారని, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సభ వేదికపై మాట్లాడలేదని గుర్తు చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే తాను మంత్రిని అయ్యానని చెప్పారు. దేశంలో సాంఘిక అసమానతలను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ చూపిన మార్గంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్ల తెలంగాణ ఏర్పడిందని, అసమానతలు రూపుమాపి సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. మహిళలకు సమానత్వ హక్కు కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్‌ అని, ఆయన స్ఫూర్తితోనే మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు తీసుకురాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. అంబేడ్కర్‌ స్ఫూర్తి పాలకులకు దిక్సూచి అని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాగా, లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు తదితరులు అంబేడ్కర్‌కు పుష్పాంజలి ఘటించారు. దేశంలోని అన్నివర్గాలను సంఘటితం చేసిన ఘనత అంబేడ్కర్‌దేనని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మేడ్చల్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం చేకూర్చేందుకు అంబేడ్కర్‌ చేసిన కృషి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సందడి

అంబేడ్కర్‌ జయంతి వేళ 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సందడి నెలకొంది. పలు జిల్లాల నుంచి సందర్శకులు, అంబేడ్కర్‌ వాదులు, దళిత సంఘాల ప్రతినిధులు తరలివచ్చి.. విగ్రహం వద్ద నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ తదితరులు అంబేడ్కర్‌ పాదాల వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. కాగా, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని రెండున్నరేళ్లు బందీగా ఉంచిన కాంగ్రెస్‌ సర్కారు.. బీఆర్‌ఎస్‌ హెచ్చరికతో అక్కడ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిందని కేటీఆర్‌ తెలిపారు. అంబేడ్కర్‌పై అభిమానం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి కేసీఆర్‌ అన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 04:31 AM