Share News

రూ.280 కోట్లతో కార్బన్‌ క్రెడిట్స్‌ కొనుగోలు!

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:01 AM

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారత రైతులతో రూ.280 కోట్ల విలువైన ‘కార్బన్‌ క్రెడిట్స్‌’ ఒప్పందం చేసుకుంది. వరి పండించే రైతుల నుంచి ఈ కార్బన్‌ క్రెడిట్లను కొనుగోలు చేయనుంది.

రూ.280 కోట్లతో కార్బన్‌ క్రెడిట్స్‌ కొనుగోలు!

  • దేశంలోని వరి రైతులతో అమెజాన్‌ ఒప్పందం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారత రైతులతో రూ.280 కోట్ల విలువైన ‘కార్బన్‌ క్రెడిట్స్‌’ ఒప్పందం చేసుకుంది. వరి పండించే రైతుల నుంచి ఈ కార్బన్‌ క్రెడిట్లను కొనుగోలు చేయనుంది. కార్బన్‌ క్రెడిట్‌ అంటే.. ఒక టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌ లేదా ఇతర హానికరమైన గ్రీన్‌హౌస్‌ వాయువులను వాతావరణంలోకి విడుదల చేయకుండా ఆపినందుకు లేదా తగ్గించినందుకు లభించే ఒక అనుమతి పత్రం. ఇది కాలుష్యాన్ని తగ్గించే ప్రాజెక్టులకు (ఉదాహరణకు అడవుల పెంపకం) లభిస్తుంది. తాజాగా అమెజాన్‌ సంస్థ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ‘ద గుడ్‌ రైస్‌ అలయెన్స్‌ (టీజీఆర్‌ఏ)’ నుంచి ఈ క్రెడిట్‌లను కొనుగోలు చేస్తుంది. భారత్‌లో వరి పండించే చిన్న రైతులతో కలిసి మీథేన్‌ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా టీజీఆర్‌ఏ పనిచేస్తోంది. ఈ ఒప్పందం కింద అమెజాన్‌.. 6.85 లక్షల టన్నులకు పైగా కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానమైన కార్బన్‌ క్రెడిట్లను దశలవారీగా కొనుగోలు చేస్తుంది. ఎక్కువగా నీటిని వినియోగించే వరి పొలాల్లో ఉత్పత్తయ్యే మీథేన్‌ ఉద్గారాలను తగ్గించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మీథేన్‌లో 8-10 శాతం వరి పొలాల ద్వారానే వస్తుందని అమెజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Apr 23 , 2026 | 05:01 AM