ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్.. నేడు సీఎం భూమి పూజ
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:48 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలోని ..
రూ. 60వేల కోట్ల పెట్టుబడులు.. 202 ఎకరాల కేటాయింపు
హైదరాబాద్/రంగారెడ్డి అర్బన్/ కందుకూరు/మహబూబ్‌నగర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలోని బేగరికంచలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో ఒకటిగా ఐటీ శాఖ తెలిపింది. ఏఐ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలో అత్యధిక డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ తొలి ప్రాధాన్యంగా నిలుస్తోందని పేర్కొంది. 2025 జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ సమయంలో అమెజాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో రాష్ట్రంలో డేటా సెంటర్ల విస్తరణకు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సూచనప్రాయంగా ఒప్పుకోగా.. 2025 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్ వెల్లిలో మరో 98 ఎకరాలు సిద్ధం చేసింది. అదనంగా రూ.125 కోట్ల విలువైన ప్రొత్సాహకాలు, రాయితీలను ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత్‌లో అతిపెద్ద ‘హైపర్ స్కేల్ డేటా సెంటర్ల’ హబ్‌గా హైదరాబాద్ నిలవనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో భాగంగా 24 నెలల్లో నిర్మాణ సంబంధిత పనులు పూర్తవుతాయని, అనంతరం రాబోయే 10 ఏళ్లలో మిగిలిన పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. అమెజాన్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం.. ముంబై తరువాతదేశంలో రెండో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ రీజియన్‌నుహైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ- కామర్స్, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్ట్‌పలు, పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోట మునిసిపాలిటీకి చేరుకుని బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖిగా సంభాషిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి, మహేశ్వరం జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి పరిశీలించారు.