Share News

ఆమనగల్లులో కాంగ్రెస్‌, బీజేపీ ఒప్పందం?

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:25 AM

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ చైర్మన్‌ పీఠం ఆ పార్టీకి దక్కకుండా పోయేలా కనబడుతోంది.

ఆమనగల్లులో కాంగ్రెస్‌, బీజేపీ ఒప్పందం?

  • బీఆర్‌ఎ్‌సకు మ్యాజిక్‌ ఫిగర్‌ ఉన్నా మారిన రాజకీయాలు

రంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ చైర్మన్‌ పీఠం ఆ పార్టీకి దక్కకుండా పోయేలా కనబడుతోంది. బీజేపీ మద్దతును కూడగట్టుకొని ఈ మునిసిపాలిటీలో పాగా వేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఆమనగల్లు మునిసిపాలిటీలో 15 వార్డులకు గాను 8 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, ఆరు వార్డుల్లో బీజేపీ, ఒక వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎ్‌్‌సకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఆ పార్టీకి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కకుండా నిలువరించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. బీజేపీ గెలిచిన 6 స్థానాలకు తోడు కాంగ్రెస్‌ ఒక స్థానంతో పాటు రెండు ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కలిపి మొత్తం 9 స్థానాలతో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికకు సిద్ధమైనట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు మున్సిపాలిటీ ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. ఆయా పార్టీల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు చైర్మన్‌, బీజేపీకి వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన 10వ వార్డు కౌన్సిలర్‌ అనిత శ్రీనివా్‌సరెడ్డిని చైర్మన్‌గా, మూడో వార్డు నుంచి గెలుపొందిన బీజేపీ నేత తల్లోజు ఆచారి సతీమణి తల్లోజు గీత వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఒక్క స్థానంలో గెలుపొందిన కాంగ్రెస్‌ చక్రం తిప్పి చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకోనుండటం ఆమనగల్లులో రాజకీయ చర్చకు తెరలేపింది.

శంకర్‌పల్లిలో రెండుగా చీలిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

శంకర్‌పల్లిలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ, చైర్మన్‌ పీఠం కైవసం చేసుకునేందుకు నేతల మధ్య పోటాపోటీ నెలకొనడం రసవత్తరంగా మారింది. చైర్మన్‌ సీటు కోసం సాత ప్రవీణ్‌కుమార్‌, దండు రాజేశ్వర్‌ పోటీ పడుతుండగా..ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలు రెండుగా చీలిపోయారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సాత ప్రవీణ్‌కుమార్‌ను ప్రతిపాదిస్తుండగా, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి దండు రాజేశ్వర్‌కు మద్దతు పలుకుతున్నారు. వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎంపిక విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మేరకు అందరు కట్టుబడి ఉండాలని మంత్రి శ్రీధర్‌బాబు వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.

Updated Date - Feb 16 , 2026 | 02:25 AM